20Years | సోలార్‌.. సిరులు!

20Years | సోలార్‌.. సిరులు!

20Years | ఎన‌ర్జీతో పేదలకు భాగ్యం
ఎల్‌నినో ప్రభావంతో జల విద్యుత్ ఉత్పత్తికి దెబ్బ
ప్రత్యామ్నాయ శక్తిగా సోలార్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం
“పీఎం సూర్య ఘర్” సబ్సిడీతో ప్రభుత్వ ప్రోత్సాహం
వినియోగ‌దారుల‌కు బిల్లుల భారం నుంచి ఊర‌ట‌

20Years | గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇంటింటా ఏసీలు, ఫ్రిజ్‌లు, మోటార్లు, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరగడంతో విద్యుత్ బిల్లులు సామాన్య కుటుంబాలకు భారంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలామంది సోలార్ విద్యుత్ వైపు మొగ్గు చూపుతున్నారు. “ఒకసారి ఖర్చు పెడితే 20 ఏళ్లు ఉచిత కరెంట్” అనే ప్రచారంతో సోలార్​వైపు దృష్టిపెడుతున్నారు. ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇవ్వడమూ వినియోగదారులకు కలిసివస్తోంది.

కాగా, దేశంలో విద్యుత్ అవసరాలు ప్రతి సంవత్సరం భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిపై అధిక భారం పడుతోంది. బొగ్గు దిగుమతులు, కాలుష్యం, ఉత్పత్తి వ్యయాలు ప్రభుత్వాలకు సవాలుగా మారుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్​ వినియోగాన్ని పెంచేలా చర్యలు చేపట్టాయి. ఈ పరిస్థితుల్లో పునరుత్పాదక ఇంధనాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. “పీఎం సూర్య ఘర్” వంటి పథకం ద్వారా గృహాలపై సోలార్ ఏర్పాటుకు సబ్సిడీ ఇస్తోంది. ఇళ్లపైనే విద్యుత్ ఉత్పత్తి జరిగితే ప్రభుత్వంపై విద్యుత్ సరఫరా ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో ఏసీల వినియోగంతో పెరిగే డిమాండ్‌ను తగ్గించడంలో రూఫ్‌టాప్ సోలార్ కీలకంగా మారింది.

ఎల్​నినో ప్రభావం.. జల విద్యుత్‌కు దెబ్బ

ఇటీవలి ఎల్​నినో ప్రభావంతో వర్షపాతం తీవ్రంగా తగ్గుతోంది. ఫలితంగా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు పడిపోతే జల విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో ప్రభుత్వాలు మళ్లీ బొగ్గు ఆధారిత విద్యుత్‌పైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యకాంతి ఆధారంగా పనిచేసే సోలార్ విద్యుత్ వ్యవస్థలు ప్రత్యామ్నాయ శక్తి వనరుగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉండే కాలంలోనే విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతుంది. అదే సమయంలో సోలార్ ఉత్పత్తి అధికంగా ఉండటం దీని ప్రత్యేకతగా నిపుణులు చెబుతున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో..
ఉమ్మడి గుంటూరు జిల్లా భౌగోళిక పరిస్థితులు సోలార్ విద్యుత్‌కు అనుకూలంగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో ఏడాదిలో ఎక్కువ రోజులు తీవ్రమైన ఎండలు నమోదవుతుంటాయి. ముఖ్యంగా గుంటూరు, తెనాలి, మంగళగిరి, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు పైగా నమోదు అవుతున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. ఫలితంగా గుంటూరు వంటి ప్రాంతాల్లో పెట్టుబడి రికవరీ కాలం మరింత తగ్గే అవకాశం ఉందని సోలార్ రంగ నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్న సమయంలో ఏసీలు ఎక్కువగా నడిచే ఇళ్లలో సోలార్ వినియోగం ద్వారా భారీగా బిల్లులు తగ్గించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

కరెంట్ బిల్లు ‘జీరో’ అవుతుందా..

సోలార్ సిస్టమ్ పెట్టుకున్న వెంటనే పూర్తిగా బిల్లు మాయం అవుతుందని భావించడం సరైంది కాదు. ఇంటి వినియోగం, పరికరాల సంఖ్య, వాతావరణ పరిస్థితులు, రాత్రి వినియోగం వంటి అంశాలపై బిల్లు ఆధారపడి ఉంటుంది. అయితే.. సరైన కెపాసిటీతో ఆన్-గ్రిడ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే నెలకు వచ్చే ₹3 వేల నుండి ₹5 వేల వరకు బిల్లును భారీగా తగ్గించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మిగులు విద్యుత్ ప్రభుత్వ గ్రిడ్‌కు వెళ్లి అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే.. ఇది పూర్తిగా నెట్ మీటరింగ్ విధానం, స్థానిక విద్యుత్ సంస్థల నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

CLICK HERE TO READ వామ్మో.. “మండే” ఎండ..!

CLICK HERE TO READ MORE