కొత్త పింఛన్లు ఇంకెప్పుడు ఇస్తారు?
కొత్త పింఛన్లు ఇంకెప్పుడు ఇస్తారు?
అవ్వ తాతలు, వికలాంగుల పొట్ట కొడుతున్న చంద్రబాబు..
ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ?
వినూత్న నిరసన చేపట్టిన దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి
విజయవాడ, ఆంధ్రప్రభ : మాయ మాటలతో గద్దెనెక్కి రెండేళ్లు అవుతున్నప్పటికీ అవ్వ తాతలకు వితంతువులకు వికలాంగులకు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని కూటమి ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. 31 వార్డు అధ్యక్షుడు దొడ్డి బాపూ ఆనంద్ అధ్యక్షతన దక్షిణ నియోజకవర్గ పరిశీలకులు వీసాల రామకృష్ణ సమక్షంలో వైసీపీ శ్రేణులతో కలిసి శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శవపేటికల్లో వృద్ధుల మృతదేహాల నమూనాలతో వినూత్న నిరసన చేపట్టారు.
చనిపోయిన వృద్ధుల పింఛన్లు అయినా మాకిప్పించండి అంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. భారీగా హాజరైన కార్యకర్తలు నాయకుల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధుల రోగులకు 66 లక్షల పైచిలుకు పెన్షన్లు అందజేశామని గుర్తు చేశారు. కానీ అబద్ధాల హామీలతో అందలం ఎక్కిన చంద్రబాబు లోకేష్ రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ కూడా పెంచకుండా కుంటి సాకులతో ఆరు లక్షల మందికి పైగా అవ్వ తాతల పెన్షన్లు తీసివేసి వారి పొట్ట కొట్టారని వాసుపల్లి మండిపడ్డారు. సూపర్ సిక్స్ పథకాలు చెప్పి ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చకుండా తండ్రి కొడుకులు తెలంగాణలో పండగలు జరుపుకోవడం సిగ్గుచేటు అన్నారు. రెండేళ్లలో అంచనా మేరకు 7 లక్షల మంది వృద్ధులు చనిపోయారని, ఎరివేసిన మరో ఆరు లక్షల పెన్షన్లు కలిపి సుమారు 13 లక్షల పెన్షన్లు కొత్తవి విడుదల చేయవచ్చునన్నారు. 18 ఏళ్ల వారికి 1500లు, 50 ఏళ్లకే పెన్షన్, నిరుద్యోగ యువతీ యువకులకు నిరుద్యోగ భృతి వంటి పథకాలు ఆటకెక్కించారన్నారు. 15,000 జీతానికి పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ పథకాలు తొలగించడం ఎంతవరకు సమంజసం అన్నారు. పేదల పొట్ట కొట్టి.. ఏం చేశారని చంద్రబాబు లోకేష్ లు పండగలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు.

విలువలు సిద్ధాంతాలతో ప్రగల్భాలు పలికే పవన్ కళ్యాణ్ కు ఇదంతా కనిపించి కూడా ఎందుకు ప్రశ్నించడం లేదని వాసుపల్లి ధ్వజమెత్తారు. వైసిపి ప్రభుత్వం ఇచ్చిన 66 లక్షల పెన్షన్లు కన్నా మూడు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు అందిస్తామని చెప్పి కేవలం ఒక్క పెన్షన్ కూడా కొత్తది ఇవ్వకపోగా కేవలం 53 లక్షల మందికే పింఛన్లు ప్రస్తుతం అందుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, పేదలకు అందించాల్సిన పింఛన్లు తక్షణమే ప్రకటించాలని వాసుపల్లి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తామని, ప్రజలే వారికి తీర్పు ఇస్తారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల ల శ్రీధర్,బిపిన్ జైన్,వార్డ్ ప్రెసిడెంట్ నీలపు సర్వేశ్వరరెడ్డి,పీతల వాసు, దశమంతులు మాణిక్యాలరావు, , పిన్నింట్ల రాజారెడ్డి, ముత్తాబత్తుల రమేష్, మహమ్మద్ షకిల్, గురజారపు రవి, భీశెట్టి ప్రసాద్, జిల్లా జనరల్ సెక్రెటరీ గనగల రామరాజు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ రాజు, స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ లింగం శ్రీను, స్టేట్ బీసీ నాయకులు లండ రమణ, మైఖేల్ రాజు, స్టేట్ నాయకులు పరవాడ ఈశ్వర్, సలాది భాను, దస్మంతుల చిన్ని, వేలంగిని రావు, భానుమూర్తి, బోరా విజయలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, సాగర్, ఈతలపాక విజయ్,జిల్లా ప్రెసిడెంట్ వడ్డాది దిలీప్, సౌత్ అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు తాడి రవితేజ,ఆకుల శ్యామ్ సువార్త రాజు,సూరపతి అప్పన్న, బొండాడ వెంకట్రావు,పిల్లా అప్పారావు,మళ్ళా విజయ్,వాసుపల్లి బంగారమ్మ,కడవల నాగమణి, రాజా పాత్రుడు,బేవార మహేష్,సూర్య, గరికిన చంద్రశేఖర్, జిల్లా అనుబంధ సంఘాల, సౌత్ అనుబంధ సంఘాల,వార్డ్ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
