లోడింగ్, రవాణాలో జాప్యం జరగొద్దు..

లోడింగ్, రవాణాలో జాప్యం జరగొద్దు..
- ధాన్యం, మక్కల కొనుగోళ్లు వేగంగా సాగాలి..
- కేంద్రాల్లో పెండింగ్ నిల్వలు లేకుండా చూడాలి
- పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : జిల్లాలో ధాన్యం, మక్కల కొనుగోళ్లు, లిఫ్టింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా రైతులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష జూలపల్లి మండలంలోని వడ్కాపూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, జూలపల్లి మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాలను, ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న వరి ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి కొనుగోలు పరిస్థితులను, నిల్వలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద మక్కల లోడింగ్ ప్రక్రియను వెంటనే చేపట్టాలని సూచించారు. రవాణా పరంగా వాహనాల కొరత సమస్య తలెత్తకుండా చూడాలని, లారీల లభ్యత తక్కువగా ఉన్నచో ప్రత్యామ్నాయంగా స్థానికంగా అందుబాటులో ఉన్న ట్రాక్టర్లను ఉపయోగించుకొని మక్కల రవాణా వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం ధర్మారం మార్కెట్ యార్డును పరిశీలించిన కలెక్టర్.. కేంద్రాలకు వచ్చే ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించి, నిబంధనల ప్రకారం కొనుగోళ్లు సజావుగా సాగేలా చూడాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొ నుగోలు, రవాణా ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జూలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మ పోచాలు, జూలపల్లి తహశీల్దార్ దత్తు ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
