మెడికవర్‌లో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు

కర్నూలు, ఆంధ్రప్రభ : సమాజ ఆరోగ్య పరిరక్షణలో వైద్యులు అందిస్తున్న సేవలను స్మరించుకుంటూ జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలులోని మెడికవర్ హాస్పిటల్స్‌లో బుధవారం ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఆసుపత్రికి చెందిన వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్యుల సేవలకు ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం వైద్యులను పుష్పగుచ్ఛాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆసుపత్రి ప్రాంగణం ఆనందోత్సాహాలతో కళకళలాడింది. ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ, వైద్య వృత్తి ఉద్యోగం మాత్రమే కాదని, మానవత్వానికి చేసే అత్యున్నత సేవ అని పేర్కొన్నారు.

ప్రతి రోగిని కుటుంబ సభ్యుడిగా భావించి నాణ్యమైన చికిత్స అందించడం, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడడం, ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం వైద్యుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ రోగికి ధైర్యం చెప్పే మాట, వైద్యుడి సేవాభావం, నమ్మకం వంటి అంశాలకు ప్రత్యామ్నాయం లేదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, సమాజానికి వైద్యులే నిజమైన హీరోలని అన్నారు.

ప్రతి రోజూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ రోగుల ప్రాణాలను కాపాడేందుకు వారు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. వారి అంకితభావం, సేవాస్ఫూర్తి, వైద్య నైపుణ్యం వల్లే వేలాది కుటుంబాల్లో ఆశలు చిగురిస్తున్నాయని పేర్కొన్నారు. మెడికవర్ హాస్పిటల్స్‌లో సేవలందిస్తున్న ప్రతి వైద్యుడికి జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించే లక్ష్యంతో వైద్య బృందానికి అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.