చౌటుప్పల్ బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
మాజీ అధ్యక్షుడు వాకిటి నరసింహారెడ్డి ఏడాది పాటు సస్పెండ్!
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (AGP) వాకిటి నరసింహారెడ్డిపై బార్ అసోసియేషన్ తీవ్ర క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆయన అసోసియేషన్ సభ్యత్వాన్ని ఏడాది పాటు (05-05-2026 నుండి 04-05-2027 వరకు) రద్దు చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానించింది.
గత మార్చి 26న జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన నరసింహారెడ్డి, ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన సీనియర్ న్యాయవాదులు సిహెచ్. రాధాకృష్ణ రావు, కానుగుల వెంకటయ్యలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ వారి ప్రతిష్టకు భంగం కలిగించారని అసోసియేషన్ పేర్కొంది.
దీనిపై విచారణ జరిపిన ‘ఫోర్ మెన్ కమిటీ’ నివేదిక ఆధారంగా, జనరల్ బాడీ సమావేశంలో మెజారిటీ న్యాయవాదుల ఆమోదంతో ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆయన ఏజీపీగా కొనసాగడానికి వీల్లేదని తీర్మానిస్తూ, ఈ ఉత్తర్వుల ప్రతులను తెలంగాణ బార్ కౌన్సిల్ సెక్రటరీ, లా సెక్రటరీ, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కు సమర్పించినట్లు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తాదూరి పరమేష్, జనరల్ సెక్రటరీ పడమటి మహిపాల్ రెడ్డి తెలిపారు.
