మెడికల్ కళాశాలకు వినోద్ తావ్డే అభినందనలు
కర్నూలు హాస్పిటల్, ఆంధ్రప్రభ : జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వినోద్ తావ్డే కర్నూలు మెడికల్ కళాశాలకు ప్రత్యేక అభినందనల లేఖ పంపించారు. దేశ ఆరోగ్య రంగానికి సేవలందిస్తున్న వైద్యులతో పాటు భావి వైద్యులను తీర్చిదిద్దుతున్న వైద్య విద్యాసంస్థలు, అధ్యాపకుల సేవలను ఆయన కొనియాడారు. తన సందేశంలో కర్నూలు మెడికల్ కళాశాల రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు తదుపరి తరం వైద్యులను తీర్చిదిద్దే ద్వంద్వ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తోందని ప్రశంసించారు. వైద్య విద్య, సేవా రంగాల్లో కళాశాల పోషిస్తున్న పాత్ర అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించిన “స్వస్థ భారత్” నిర్మాణంలో వైద్యులు, వైద్య విద్యాసంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, కర్నూలు మెడికల్ కళాశాల నుంచి బయటకు వచ్చే ప్రతి వైద్యుడు ఆ లక్ష్య సాధనలో భాగస్వామిగా నిలుస్తున్నారని వినోద్ తావ్డే తన సందేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు మెడికల్ కళాశాల అధ్యాపకులు, వైద్యులు, వైద్య విద్యార్థులందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో తమ సేవలను మరింత విస్తరించి, దేశాభివృద్ధికి నిరంతరం తోడ్పాటునందించాలని ఆకాంక్షించారు.
