సహకార సంఘాల పాలక మండలి ఎన్నికలు నిర్వహించాలి

సహకార సంఘాల పాలక మండలి ఎన్నికలు నిర్వహించాలి
– రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్ర కుమార్
జూలూరుపాడు, ఆంధ్రప్రభ: ప్రాథమిక వ్యవసాయ పరిషత్ సంఘాల పాలక మండలి ఎన్నికలను వెంటనే నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్ర కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం ఎదుట రైతు సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా, నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేసి పీఏసిఎస్ (PACs) ఎన్నికలు జరపాలని తహసీల్దార్ తూమాటి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ, సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రతి ఐదేళ్లకోసారి పాలక మండలికి ఎన్నికలు జరుపుతాయని, అయితే పదవి కాలం ముగిసిన PACsకు ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తారని అన్నారు.
నామినేట్ పద్ధతిలో పాలక మండలి ఏర్పాటు చేయాలనే విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల్లో రాజకీయ జోక్యం లేకుండా చూడాలని నరేంద్ర కుమార్ కోరారు. రాజకీయ నిరుద్యోగులు సహకార సంఘ చైర్మన్, డైరెక్టర్లుగా నామినేట్ చేయడం అన్యాయమని, సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలను నిలిపివేయాలని కూడా అన్నారు.
ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే, రైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రెండు లక్షల రుణ మాఫీ పూర్తి అమలు కాలేదని, రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని నరేంద్ర కుమార్ అన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గుండె పిన్ని వెంకటేశ్వర్లు, ఎస్కే నాగుల్ మీరా, యాస రోశయ్య, యల్లంకీ మధు, సిరిపురపు వెంకటేశ్వర్లు, తూము కోటయ్య, పొన్నెకంటి వెంకటేశ్వర్లు, చిమట ముత్తయ్య, ముత్తిలింగం, ఊడల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
