Kanaka Durga Train : కనక దుర్గ రైలుకు గ్రీన్​ సిగ్నల్​ Andhra Prabha News

Kanaka Durga Train : కనక దుర్గ రైలుకు గ్రీన్​ సిగ్నల్​ Andhra Prabha News

  • బెజవాడ భక్తుల ఆకాంక్షకు పచ్చజెండా
  • దుర్గమ్మ పేరిట రైలు ప్రతిపాదనకు రైల్వేలో కదిలిక
  • ఎమ్మెల్యే సుజనా చౌదరి లేఖకు సానుకూల స్పందన..
  • విజయవాడకు మరో గుర్తింపుగా ‘కనకదుర్గ’ రైలు ఆశలు..

( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో )

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనక దుర్గ టెంపుల్ అమ్మవారిపై కోట్లాది భక్తులకు ఉన్న విశ్వాసం, ఆధ్యాత్మిక అనుబంధానికి ప్రతీకగా విజయవాడ నుంచి నడిచే ఒక రైలుకు ‘కనకదుర్గ’ పేరు పెట్టే ప్రక్రియకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇటీవల రైల్వే శాఖకు అధికారికంగా లేఖ రాయగా, దీనిపై రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. విజయవాడ నగరానికి ఆధ్యాత్మిక గుర్తింపుగా నిలిచిన కనకదుర్గమ్మ పేరును రైలుకు పెట్టడం ద్వారా దేశవ్యాప్తంగా బెజవాడకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావచ్చని ఎమ్మెల్యే సుజనా చౌదరి తన ప్రతిపాదనలో పేర్కొన్నరు.భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, విజయవాడ నుంచి నడిచే ప్రధాన రైలుకు అమ్మవారి పేరు ఇవ్వాలని ఆయన కోరారు.

ఈ ప్రతిపాదనపై స్పందించిన విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు, సంబంధిత అంశాన్ని పరిగణలోకి తీసుకుని అవసరమైన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే సుజనా చౌదరికి లేఖ ద్వారా తెలియజేశారు.
విజయవాడ జంక్షన్ దక్షిణ మధ్య రైల్వేలో అత్యంత కీలకమైన జంక్షన్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ దేశంలోని ప్రధాన రైల్వే కనెక్టివిటీ కేంద్రాల్లో ఒకటిగా కొనసాగుతోంది. కనకదుర్గమ్మ పేరుతో రైలు నడిస్తే అది కేవలం రవాణా సేవ కాకుండా బెజవాడ ఆధ్యాత్మిక వైభవానికి జాతీయ స్థాయిలో మరో గుర్తింపుగా నిలుస్తుందని భక్తులు, స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అధికారిక ఆమోదం లభిస్తే బెజవాడ వాసుల ఎన్నాళ్లనో ఉన్న ఆకాంక్ష నెరవేరినట్టేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.