ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం
– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
-జూన్ 2 నుంచి రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
-ధరణి, సాదా బైనామా సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరిస్తాం
ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జరిగిన ప్రజాదర్బార్‌లో ఆయన జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజలతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదాలతో ప్రజా ప్రభుత్వం మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు. పేదలు, రైతులు, మహిళలు, నిరుద్యోగ యువత సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే అధికారులను ప్రజల వద్దకు పంపించి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కార చర్యలు చేపట్టామని చెప్పారు.
రెండేళ్ల పాలన అనంతరం మళ్లీ ప్రజల వద్దకే అధికారులను పంపిస్తూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని మూడు క్లస్టర్లుగా, మున్సిపాలిటీని రెండు క్లస్టర్లుగా విభజించి ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 11 క్లస్టర్ల కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయని చెప్పారు.
ప్రతి దరఖాస్తుపై అధికారులకు పూర్తి జవాబుదారీతనం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తామని, మరికొన్నింటికి కొంత సమయం పట్టవచ్చని తెలిపారు. అయితే అర్హత గల ప్రతి దరఖాస్తును మూడు నెలల్లోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ, పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని చెప్పారు.
గురుకుల పాఠశాలల్లో డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మొటిక్ ఛార్జీలను 200 శాతం పెంచినట్లు తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని చెప్పారు.
గత పదేళ్లలో పేదలకు ఇళ్లు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం తొలి దశలోనే లక్షలాది ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని, జూన్ 2 నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రారంభమవుతుందని వెల్లడించారు. అనంతరం మూడో, నాలుగో విడత ఇళ్లను కూడా మంజూరు చేస్తామని తెలిపారు. ప్రతి అర్హ కుటుంబానికి రూ.5 లక్షల సాయం రాజకీయాలకు అతీతంగా అందిస్తామని స్పష్టం చేశారు.
ప్రజాదర్బార్ కార్యక్రమాల్లో ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయని, గత ప్రభుత్వం ఇళ్లు నిర్మించకపోవడమే దీనికి కారణమని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుండటంతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు.
ధరణి కారణంగా ఏర్పడిన భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరిస్తున్నామని తెలిపారు. సాదా బైనామా దరఖాస్తులను కూడా అర్హత మేరకు పరిష్కరిస్తామని చెప్పారు. త్వరలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు.
నిరుద్యోగ యువతకు తొలి ఏడాదిలోనే 70 వేలకుపైగా ఉద్యోగాలు కల్పించామని మంత్రి తెలిపారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి, ఎలాంటి లీకులు లేకుండా ప్రతిభావంతులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని శుభవార్తలు అందిస్తామని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ మాట్లాడుతూ, ఏదులాపురం మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం తొలి ప్రజాదర్బార్ అని తెలిపారు. ఇప్పటివరకు గ్రామాల వారీగా నిర్వహించిన క్లస్టర్ కార్యక్రమాల ద్వారా సుమారు 16 వేల దరఖాస్తులు స్వీకరించినట్లు వెల్లడించారు. ప్రతి దరఖాస్తును ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు జయలక్ష్మి, మమత మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం వచ్చాక తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, ప్రస్తుతం సొంతింట్లో ఆనందంగా జీవిస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం వంటి పథకాల ద్వారా ప్రతి నెల సుమారు రూ.4 వేల వరకు ఆదా అవుతోందని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ అనిత, వైస్ చైర్మన్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, మున్సిపల్ కమిషనర్, జిల్లా అధికారులు, వార్డ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

