సీతారామ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి పొలాలకు నీళ్లిస్తాం!

  • ​గత ప్రభుత్వ రీడిజైనింగ్ దోపిడీపై మండిపడ్డ డిప్యూటీ సీఎం భట్టి,
  • ​ఖమ్మం, కొత్తగూడెం కలెక్టర్లకు భూసేకరణ నిధులపై కీలక ఆదేశాలు
  • ​రూ. 135 కోట్ల భూసేకరణ నిధుల క్లియరెన్స్‌కు గ్రీన్ సిగ్నల్
  • ​పనులను వేగవంతం చేసే కాంట్రాక్టర్ల బిల్లులు వెంటనే చెల్లిస్తాం: క్షేత్రస్థాయి పరిశీలనలో ఉప ముఖ్యమంత్రి వెల్లడి

ఖమ్మం ఉమ్మడి బ్యూరో – ఆంధ్రప్రభ : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (టన్నెల్) పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే ఇందిరమ్మ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో ని సీతారామ టన్నెల్ పనుల పురోగతిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల రీడిజైన్ల పేరిట జరిగిన లూటీని తీవ్రంగా ఎండగట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడిన ‘ప్రజా ప్రభుత్వం’ పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ యుద్ధప్రతిపాదికన పూర్తి చేయడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

​రీడిజైన్ల పేరిట రూ. 24 వేల కోట్ల దోపిడీ!

​”గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రుద్రంకోట వద్ద ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.  అప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయి. ఈపీసీ విధానం ద్వారా మిగిలిన రూ. 1,500 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే ఈపాటికే ఆ భూములకు నీళ్లు పారేవి” అని గుర్తుచేశారు. ​కానీ, గత బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం అంచనాలను పెంచి దోపిడీ చేయడానికే ఆ ప్రాజెక్టులను ‘సీతారామ ప్రాజెక్టు’గా రీడిజైన్ చేసి, సీతమ్మ సాగర్ బ్యారేజీతో కలుపుకొని అంచనా వ్యయాన్ని ఏకంగా రూ. 24 వేల కోట్లకు పెంచిందని ఆరోపించారు. పదేళ్ల కాలంలో రూ. 7,500 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వృథా చేస్తూ దోపిడీకి తెరలేపారని మండిపడ్డారు.

​కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుతూ, సీతారామ ప్రాజెక్టును సాధ్యమైనంత అర్థవంతంగా   మరింత అర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు డిప్యూటీ సీఎం వివరించారు.” రాజీవ్ కెనాల్ లింక్ కోసం రూ. 100 కోట్లు మంజూరు చేసి ఎన్ఎస్పీ (NSP) కెనాల్, వైరా రిజర్వాయర్లకు అనుసంధానిస్తున్నారు. పాలేరు రిజర్వాయర్ కు వెళ్లే జూలూరుపాడు టన్నెల్ పనులను వేగవంతం చేసి, మున్నేరు నదిని లింక్ చేయడం ద్వారా పాలేరు, వైరా, లంకా సాగర్ రిజర్వాయర్లను నింపనున్నారు. దీనివల్ల సత్తుపల్లి, పరిసర ప్రాంతాల రైతులకు  త్వరగా సాగు నీరందిస్తాం “అని వివరించారు.

ఈ ప్రాజెక్టు పనుల కోసం మా ప్రభుత్వం ఇప్పటికే రూ. 1000 కోట్ల బిల్లులను విడుదల చేయడంవల్ల పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. “భూసేకరణ  కోసం దాదాపు రూ. 135 కోట్ల నిధులు అవసరమని అధికారులు తెలిపారు. ఇప్పటికే టోకెన్స్ రైజ్ చేసి ఉన్న పక్షంలో, వాటిని తక్షణమే క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కడ భూసేకరణ అవసరమైనా వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేసి బిల్లులు పంపాలని” కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల  కలెక్టర్లను ఆదేశించారు ​వేగంగా పనులు పూర్తి చేసే కాంట్రాక్టర్లకు  బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరితగతిన నిధులు విడుదల చేస్తామని, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బిల్లుల చెల్లింపులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసం, ఆ నీరు వృథా కాకూడదన్నదే మా లక్ష్యం.ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి, పొలాలకు నీళ్లు పారించాలనే సంకల్పంతో ఈ ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.