జైల్లో పరిచయం.. బయటికి వచ్చాక దొంగతనాలకు శ్రీకారం

జైల్లో పరిచయం.. బయటికి వచ్చాక దొంగతనాలకు శ్రీకారం
- అంతర్ జిల్లా దొంగలు ఇద్దరు అరెస్ట్
- దుర్గాదేవి విగ్రహం, సింహం పంచలోహ విగ్రహా లు స్వాధీనం
- ఇద్దరు నిందితుల అరెస్టు రిమాండ్ కు తరలింపు
చిట్యాల, ఆంధ్రప్రభ:
నల్గొండ జిల్లాతో పాటు పలు జిల్లాలలో వరుస దొంగతనాలతో కలకలం రేపుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను చిట్యాల పోలీసులు ఎట్టకేలకు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి సుమారు రూ. 10 లక్షల విలువైన దొంగిలించబడిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి వెల్లడించారు.
మంగళవారం సాయంత్రం చిట్యాల పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో డీఎస్‌పీ కేసు వివరాలను తెలియజేస్తూ తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల్లో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కండ్లకోయ గ్రామానికి చెందిన నీలపు నీలయ్య (26) , సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ప్రాంతానికి చెందిన బత్తిని నరేష్ అలియాస్ లవ్లీ నరేష్ చిట్యాల పోలీసులకు పట్టుబడ్డారు. నిందితులు గతంలో వాహన చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు.
వీరు చర్లపల్లి జైలుకు వెళ్లిన నీలయ్య, నరేష్‌లకు అక్కడ పరిచయం ఏర్పడింది. విడుదలైన తర్వాత జల్సాలకు అలవాటై వీరిద్దరూ కలిసి పటాన్ చెరువులో ఒక గదిని అద్దెకు తీసుకుని ముఠాగా ఏర్పడి దొంగతనాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్, మేడ్చల్, దుండిగల్, అమీన్‌పూర్, సంగారెడ్డి, చిట్యాల ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాల హ్యాండిల్ లాకులు విరగ్గొట్టి చోరీ పాల్పడుతున్నారని తెలిపారు.. వాహనాలే కాకుండా తాళం వేసిన ఇళ్లు, దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు.
నిందితుల నుండి 06 మోటార్ సైకిళ్లు, ఆలయంలో దొంగిలించిన దుర్గాదేవి, సింహం పంచలోహ విగ్రహాలు, సుమారు 5 గ్రాముల బంగారు వస్తువులు , స్మార్ట్ టీవీ, ల , లెనోవా ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే దొంగతనాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కే శివరాం రెడ్డి హెచ్చరించారు. ప్రజలు తమ వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో పార్క్ చేయాలని, నివాసాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కేసును ఛేదించిన సీఐ నాగరాజు, చిట్యాల ఎస్ఐ రవికుమార్, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.


