పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలి: డీఆర్వో నరసింహులు
తిరుపతి కలెక్టరేట్, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా పరిశీలించి, వేగవంతంగా పరిష్కరించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) నరసింహులు సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్జీల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని స్పష్టం చేశారు.
సోమవారం తిరుపతి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో డీఆర్వో నరసింహులు, డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్, భరత్ నాయక్, రోస్మండ్ కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, సంబంధిత శాఖల అధికారులు సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 332 అర్జీలు అందాయి. వాటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు 178, దేవాదాయ శాఖకు 34, పంచాయతీరాజ్ శాఖకు 21, గురుకుల విద్యాశాఖకు 19, పోలీసు శాఖకు 16, ఎస్‌ఈఆర్‌పీకి 11, విద్యాశాఖకు 10, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు 6, నీటిపారుదల శాఖకు 5, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖలకు చెరో 4, విద్యుత్ శాఖకు 3, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, సాంఘిక సంక్షేమ, మత్స్య, గృహ నిర్మాణ శాఖలకు చెరో 2, టిడ్కో, తుడా, స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు, నైపుణ్య అభివృద్ధి, జేఎన్‌టీయూ రిజిస్ట్రార్, గిరిజన సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి శాఖలకు ఒక్కో అర్జీ చొప్పున అందాయి.
