పెండింగ్ బిల్లులతో కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు
పెండింగ్ బిల్లులతో కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు
– బీఏఐ ప్రతినిధుల ఆవేదన
నల్గొండ, ఆంధ్రప్రభ:
ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆత్మహత్యలు జరుగుతున్నాయని అసోసియేషన్ ఆఫ్ బిల్డర్స్ ఆఫ్ ఇండియా (BAI) ప్రతినిధి డి.వి.ఎన్. రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, బీఏఐ అనేది ప్రభుత్వానికి, కాంట్రాక్టర్లకు మధ్య వారధిలా పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2017 వరకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానం అమల్లో ఉండగా, తర్వాత దాన్ని ఎత్తివేశారని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ సీరియల్ పద్ధతిలో బిల్లులు చెల్లిస్తారని ఆశించినప్పటికీ, ఆ దిశగా చర్యలు లేవని వారు విమర్శించారు. ప్రభుత్వ పనుల విషయంలో కొత్త, పాత పనులుగా వేరుచూసే విధానం సరైంది కాదని, ఇది కాంట్రాక్టర్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో SDF ద్వారా చేసిన పనులకు సుమారు రూ.4,000 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎన్నో వినతిపత్రాలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే దానికి అనుగుణంగా పనులు చేయాలని, కానీ కాంట్రాక్టర్లను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు. నాగర్‌కర్నూల్‌లో మూడు నెలల క్రితం శ్రీనివాస్ రెడ్డి అనే కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనను ప్రస్తావిస్తూ, ఆయనకు రూ.10 కోట్ల బిల్లులు రావాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు రూ.20 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.
బిల్లులు ఆలస్యం కావడంతో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ నెల 18న రాష్ట్రస్థాయి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అందరం కలిసి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఏఐ నేతలు సిహెచ్ శ్రీనివాసరావు, సంతోష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎస్. కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
