మోదీ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష…
మోదీ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష…
- బీజేపీ రాష్ట్ర నాయకులు పాతూరి సుధాకర్ రెడ్డి..
మేడ్చల్, ఆంధ్రప్రభ : ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టాక మొదటిసారి హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా పరేడ్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభ విజయవంతం కావడంపై బీజేపీ రాష్ట్ర నాయకులు పాతూరి సుధాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ నుండి పాలమూరు వరకు తెలంగాణ నలుమూలల నుండి సకల జనులు స్వచ్ఛందంగా తరలివచ్చి సభను ఒక ఉప్పెనలా మార్చారని ఆయన కొనియాడారు.
నిన్నటి సభలో ప్రజలు చూపిన ఉత్సాహం చూస్తుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని పాతూరి ధీమా వ్యక్తం చేశారు. “ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజలు హర్షధ్వానాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. మేము మీకు అండగా ఉంటామంటూ ప్రజలే స్వయంగా సంకల్పం తీసుకుని వెళ్లడం శుభపరిణామం,” అని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
సబ్ కా సాత్ – సబ్ కా వికాస్: కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా 140 కోట్ల భారతీయుల అభివృద్ధి కోసం మోదీ నిరంతరం పాటుపడుతున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల పాలన కంటే అన్ని రంగాల్లో దేశాన్ని నాలుగింతలు వేగంగా మోదీ నాయకత్వం అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి, అరాచక పాలన సాగించినప్పటికీ, అక్కడి ప్రజలు ఆమె గుండా రాజ్యాన్ని అంతమొందించి బీజేపీకి బ్రహ్మరథం పట్టారని గుర్తు చేశారు.
అదే స్ఫూర్తి తో తెలంగాణలోనూ పునరావృతం అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసారి బీజేపీ అధికారమే లక్ష్యంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారని, ఈ క్రమంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేయాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేసి రాష్ట్రంలో ‘డబుల్ ఇంజిన్’ సర్కార్ తెచ్చేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.
