Ghatkesar | ఆసుప‌త్రిలో విద్యార్థిని మృతి..

Ghatkesar | ఆసుప‌త్రిలో విద్యార్థిని మృతి..

ఘట్‌కేసర్, ఆంధ్రప్రభ : నర్సింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని నవంబర్ 6న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విషాదాంతమైంది. తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న ఆమె.. మృతి చెందినట్లు ఘట్‌కేసర్ పోలీసులు తెలిపారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔషాపూర్‌లో చోటుచేసుకుంది.

ఘట్‌కేసర్ సీఐ బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రానికి చెందిన మల్లి పూజిత (22) అన్నోజిగూడలో అద్దెకు ఉంటూ, అనురాగ్ యూనివర్సిటీ పరిధిలోని నీలిమ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అండ్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది.

నవంబర్ 6న రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నప్పటికీ పూజిత కళాశాలకు వచ్చింది. మధ్యాహ్న సమయంలో భోజనానికి వెళ్లకుండా, కొంతసేపు ఫోన్‌లో ఎవరో వ్యక్తితో మాట్లాడింది. అనంతరం ఫోన్‌ను రెయిలింగ్‌పై వుంచి, ఒక్కసారిగా కళాశాల భవనం మూడో అంతస్తు నుంచి దూకేసింది.

తీవ్రగాయాలపాలైన ఆమెను తోటి విద్యార్థులు వెంటనే నీలిమ హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆరవ తేదీ నుంచి చికిత్స పొందుతున్న పూజిత అనంతరం మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు.

ఆమె ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు స్నేహితులను ఆరా తీశారు. తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ పూజిత డిప్రెషన్‌కు లోనవుతున్నట్లు స్నేహితులు వెల్లడించారు. అలాగే ఆమె వాట్సాప్ స్టేటస్‌లో ‘THE END’ అని పెట్టినట్లు గుర్తించారు. ఈ ఆధారాలపై ప్రేమ వ్యవహారంలో ఏర్పడిన సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్యాయత్నం చేసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply