రోడ్డు భద్రతకై ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి – స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

రోడ్డు భద్రతకై ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి – స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్, ఆంధ్రప్రభ: 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా వికారాబాద్ జిల్లా పోలీసు, రవాణా శాఖల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నేపల్లి చౌరస్తా వద్ద “అరైవ్- అలైవ్” అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. యువకులు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, వారి కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను ఇవ్వకూడదని, వారి భవిష్యత్తు పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని కోరారు. ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ ప్రమాణాలను ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా పాటించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply