మేడ్చల్‌లో ఘనంగా ‘ఇందిరమ్మ చీరల’ పంపిణీ..

  • మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ పెద్దపీట
  • మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి…
  • ​మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం
  • వేముల శ్రీనివాస్ రెడ్డి

మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని మేడ్చల్ డివిజన్లలోని పొదుపు సంఘాల మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు అందిస్తామని మేడ్చల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మేడ్చల్ పట్టణంలోని వినాయక నగర్ కాలనీ రోడ్ నెంబర్ -2 లో గల ఎల్లమ్మ గుడి ప్రాంగణంలో ‘ఇందిరమ్మ చీరల పంపిణీ’ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేముల శ్రీనివాస్ రెడ్డి, వందలాది మంది మహిళలకు స్వయంగా చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వేముల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆశయాల స్ఫూర్తితోనే, ఇందిరమ్మ పేరుతో మహిళలకు ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడూ మహిళలకు అత్యున్నత గౌరవం, స్థానం ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారిని కోటీశ్వరులను చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే మహిళల కోసం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని విజయవంతంగా అమలు చేసి చూపించామని, మహాలక్ష్మి, గృహజ్యోతి, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ పథకాలతో ప్రతి ఇంటా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనందాలు నింపుతోందని హర్షం వ్యక్తం చేశారు.

మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధి కోసం త్వరలోనే వారికి పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలను కూడా అప్పగించబోతున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం పట్ల చీరలు అందుకున్న మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్పీ స్వప్న, మేడ్చల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు కౌడే మహేష్ కురుమ, బత్తుల మధుకర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.