4.54crores | తిరుమలలో భక్తుల సౌకర్యాలపై టీటీడీ కీలక నిర్ణయాలు

4.54crores | తిరుమలలో భక్తుల సౌకర్యాలపై టీటీడీ కీలక నిర్ణయాలు

4.54crores | తిరుమల (ఆంధ్రప్రభ): టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. మొత్తం 82 అంశాలపై చర్చించి తీర్మానాలు చేసినట్లు తెలిపారు.

తిరుమలలోని ఆళ్వార్ ట్యాంక్ కూడలి నుంచి బాలగంగమ్మ కూడలి వరకు టాయిలెట్ల నిర్మాణానికి రూ. 4.54 కోట్లు మంజూరు చేశారు. శ్రీవారి ఆలయం మాడవీధులు, రహదారులు, కూడళ్లకు 51 మంది భక్తాగ్రేసుల పేర్లు పెట్టాలని నిర్ణయించారు.

గోగర్భం డ్యామ్ నుంచి ఫిల్టర్ హౌస్ వరకు రూ. 6 కోట్లతో పైప్‌లైన్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే రూ. 44.2 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆప్కో, తమిళనాడుకు చెందిన కోఆపటెక్స్ సంస్థల నుంచి పట్టువస్త్రాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

తమిళనాడు కోయంబత్తూరులో జీ-స్క్వేర్ సంస్థ టీటీడీ పేరిట రిజిస్టర్ చేసిన 19.49 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఆమోదం తెలిపారు. తిరుమలలో వరాహస్వామి విశ్రాంతి భవనం ఆధునీకరణకు రూ. 3.6 కోట్లు కేటాయించారు.

పద్మశ్రీ శోభారాజ్‌ను టీటీడీ ఆస్థాన విద్వాన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలోని శ్రీవారి ఆలయంలో నూతన మండపాల నిర్మాణానికి రూ. 36.9 కోట్లు మంజూరు చేశారు.

ఖమ్మంలో తెలంగాణ ప్రభుత్వం టీటీడీకి కేటాయించిన 20 ఎకరాల భూమిపై అభివృద్ధి చర్యలు చేపట్టనున్నారు. టీటీడీలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఐడీ కార్డులు, లడ్డూ కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు.

టీటీడీ ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్‌ను రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. పాదిరేడు ప్రాంతంలో ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల అభివృద్ధికి కమిటీని నియమించారు.

జూలై 15 వరకు ప్రజాప్రతినిధుల సిఫార్సులతో విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించారు. వేసవి సెలవుల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

రాతి రథ మండపం అంశంపై చర్చించి త్వరలో నిర్ణయం ప్రకటించనున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు రోడ్డు విస్తరణ చేపట్టాలని, బస్ బే కోసం ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.