గిరిజనులకు మేలు చేసే అటవీ హక్కుల చట్టం – 2006

గిరిజనులకు మేలు చేసే అటవీ హక్కుల చట్టం – 2006

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : అటవీ భూములపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులు మరియు సంప్రదాయ అటవీ నివాసితుల హక్కులను గుర్తిస్తూ 2006లో పార్లమెంట్ తీసుకొచ్చిన “అటవీ హక్కుల గుర్తింపు చట్టం – 2006” ఎంతో గొప్ప చట్టమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు కలెక్టరేట్‌లోని నాగార్జున ఐఏఎస్ వీడియో సమావేశ మందిరంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అటవీ హక్కుల చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ చరిత్రలో మొదటిసారిగా అటవీ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్న వారి హక్కులను చట్టబద్ధంగా గుర్తించిన చట్టం ఇదేనని తెలిపారు. గిరిజనుల జీవనోపాధి, హక్కుల పరిరక్షణలో ఈ చట్టం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. బంగారుపాళ్యం మండలం పరిధిలోని మూడు ప్రాంతాలకు సంబంధించిన రహదారి నిర్మాణ ప్రతిపాదనలను జిల్లా స్థాయి కమిటీ పరిశీలించి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. అందులో భాగంగా తుంబపాళ్యం గ్రామం నుండి పీలేరు చెట్టుపల్లి కాలనీ వరకు రహదారి నిర్మాణం కోసం 0.972 హెక్టార్ల అటవీ భూమి వినియోగానికి అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు.

అలాగే గోర్రెలనగరి నుండి వేపనపల్లి వరకు రహదారి నిర్మాణానికి 0.970 హెక్టార్లు, రాగిమాను పెంట గ్రామం నుండి కేఎం కండ్రిగ గ్రామం వరకు రహదారి నిర్మాణానికి 0.675 హెక్టార్ల అటవీ భూమి వినియోగానికి జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, జిల్లా అటవీ శాఖ అధికారి సుబ్బరాజు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, సాంకేతిక అధికారులు త్రివాసమూర్తి, ప్రాజెక్టు అమలు విభాగం కార్యనిర్వాహక ఇంజనీరు నాగరాజు, సహాయ ఇంజనీరు నరసింహారెడ్డి, రహదారులు మరియు భవనాల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీరు సుదర్శన్ బాబు, అటవీ శాఖ పరిధి అధికారి పట్టాభి, జిల్లా స్థాయి కమిటీ సభ్యుడు సుబ్రమణ్యం, జడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.