బాధిత పోలీసు కుటుంబాలకు అండగా పోలీస్ శాఖ..

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఐడీఆర్‌ఎఫ్ నిధుల నుంచి బాధిత పోలీసు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ చేతుల మీదుగా రూ.1,30,000 చెక్కులను సంబంధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. సదుం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ హెచ్‌సీ-269 పి.టి. గిరిబాబు కుటుంబానికి ఐడీఆర్‌ఎఫ్ నిధుల నుంచి రూ.1 లక్ష చెక్కును ఆయన సతీమణి శాంతికి ఎస్పీ అందజేశారు.

అలాగే సోమల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన పీసీ-3832 పి. రమేష్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.30 వేల ఆర్థిక సహాయం చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అవసరమైన సహాయ సహకారాలను అన్ని విధాలుగా అందిస్తామని భరోసా ఇచ్చారు. పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు ఇన్‌చార్జ్ అడ్మిన్ ఎస్.ఆర్. రాజశేఖర రాజు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply