Summer Holidays | ఈత రాకపోయినా…
Summer Holidays | ఈత రాకపోయినా…
Summer Holidays | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కూతురు మునిగిపోతుందన్న భయంతో ఓ తల్లి తన ప్రాణాలనే ఫణంగా పెట్టింది. ఈత రాకపోయినా సరే కూతుర్ని కాపాడాలని నీటిలోకి దూకి చివరకు తానే మునిగి మృతిచెందింది. ఈ విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
ఉప్పునుంతల మండలం వెల్టూరు గ్రామానికి చెందిన అనూష(35)కు ఇద్దరు కుమార్తెలు ధనలక్ష్మీ(12), అక్షిత(10) ఉన్నారు. భర్త ఐదేళ్ల క్రితమే మృతిచెందడంతో కూలీ పనులు చేస్తూ ఇద్దరు పిల్లలను ఆమె పోషిస్తోంది.
వేసవి సెలవులు కావడంతో పిల్లలకు ఈత నేర్పించాలని భావించిన అనూష, వారిని నీటి గుంత వద్దకు తీసుకెళ్లింది. చిన్న కుమార్తె అక్షిత నడుముకు కూల్‌డ్రింక్ బాటిళ్లు కట్టి నీటిలోకి దింపింది. అయితే నీటిలోకి దిగిన వెంటనే అక్షిత భయంతో ఏడవడం ప్రారంభించింది.
కూతురు మునిగిపోతుందేమోనని కంగారుపడిన అనూష వెంటనే నీటిలోకి దూకింది. కానీ ఆమెకూ ఈత రాకపోవడంతో అదే గుంతలో మునిగిపోయింది. పెద్ద కుమార్తె ధనలక్ష్మీ స్థానిక రైతులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని అక్షితను సురక్షితంగా బయటకు తీశారు. అయితే అప్పటికే అనూష ప్రాణాలు కోల్పోయింది. తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
