Micro finance | మైక్రో ఫైనాన్స్‌ల విస్తరణ – పేదలపై ప్రభావం

Micro finance | మైక్రో ఫైనాన్స్‌ల విస్తరణ – పేదలపై ప్రభావం
Micro finance | రుణాల ఊబిలో మహిళల ఇబ్బందులు
సంఘాల బాధ్యత – 100% రికవరీ వెనుక నిజం
మైక్రో ఫైనాన్స్ ఆగడాలు – పునరావృతమవుతున్న ఘటనలు
ప్రభుత్వ జోక్యం ఎందుకు అవసరం
Micro finance | ఉభయ తెలుగు రాష్ట్రాలలో మైక్రో ఫైనాన్స్‌ల ఆగడాలు శృతి మించిపోతున్నాయి. గతంలో పలువురు పేద మహిళల ప్రాణాలు బలిగొన్న మైక్రో ఫైనాన్సులు మళ్లీ విజృంభిస్తున్నాయి. పేద కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా పతనం చేస్తూ వారి పాలిట శాపంగా మారిన మైక్రో ఫైనాన్సులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రభుత్వం నిషేధించింది. తిరిగి పుంజుకున్న మైక్రో ఫైనాన్సులు ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుంటూ మళ్లీ విస్తరిస్తున్నాయి. తీసుకున్న రుణాన్ని ప్రతి వారం చెల్లించాల్సిన విధానం కారణంగా పేదవర్గాలు మైక్రో ఫైనాన్స్‌ల ఊబిలో కూరుకుపోతున్నాయి. మరోసారి పాత దుర్ఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు.
సమభావన సంఘాలు, స్త్రీనిధి, ముద్ర వంటి పథకాల ద్వారా ప్రభుత్వం రుణాలను అందిస్తున్నప్పటికీ, తక్షణ ఆర్థిక అవసరాల కోసం పలువురు మహిళలు మైక్రో ఫైనాన్స్‌లను ఆశ్రయిస్తున్నారు. కానీ తిరిగి చెల్లింపులో ఇబ్బందులు ఎదుర్కొంటూ మానసిక, ఆర్థిక క్షోభకు గురవుతున్నారు. దీంతో నెలవారీగా చెల్లించాల్సిన బ్యాంకు లింకేజీ రుణాలను కూడా చెల్లించలేకపోతున్నారు. దీంతో మైక్రో ఫైనాన్స్‌ల ఆగడాలను ప్రారంభ దశలోనే నియంత్రించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భారత బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాల చెల్లింపులో మహిళా సంఘాలే అగ్రగామిగా నిలుస్తున్నాయి. ఒక సభ్యురాలు రుణ వాయిదా చెల్లింపులో ఆలస్యం చేసినా, మిగతా సభ్యులు బాధ్యత వహిస్తూ ఆ రుణాన్ని చెల్లించడంలో సహకరిస్తున్నారు. దీంతో మహిళా సంఘాల రికవరీ దాదాపు 100 శాతంగా ఉంటుంది.
మహిళల ఆర్థిక అవసరాలు, వారి నిజాయితీని ఆసరాగా చేసుకుని పలు మైక్రో ఫైనాన్సులు విస్తరిస్తున్నాయి. ఆర్బీఐ నిబంధనల మేరకు రుణాలు ఇస్తున్నామని చెబుతూ, మైక్రో ఫైనాన్స్ ప్రతినిధులు పట్టణాల బస్తీలు, గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి రుణాలు అందిస్తున్నారు. 10 మందితో సంఘాలు ఏర్పాటు చేసి, రుణ మంజూరు ప్రక్రియను పూర్తి చేసి వారంవారం వాయిదాలను వసూలు చేస్తున్నారు. మొదట ఒక్కో సభ్యురాలికి రూ.30,000 వరకు రుణం ఇస్తూ, తరువాత క్రమంగా రుణ పరిమితిని పెంచుతున్నారు. అంతేకాకుండా ఆస్తులపై మార్ట్గేజ్ లోన్లు కూడా ఇస్తున్నారు.
దీంతో పలువురు మహిళలు తమ సామర్థ్యానికి మించి రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. రుణ వాయిదా చెల్లించే రోజున ఇంటికి తాళం వేసి వెళ్లడం, ఫోన్ అందుబాటులో లేకపోవడం వంటి పరిస్థితులు పెరుగుతున్నాయి. దీంతో మిగతా సభ్యులు, మైక్రో ఫైనాన్స్ ప్రతినిధులు వారి ఇళ్ల ముందు గొడవలు చేస్తున్నారు. గతంలో రుణగ్రహీతలు మరణించిన సందర్భాల్లో, రుణ చెల్లింపు పూర్తయ్యే వరకు అంత్యక్రియలు నిర్వహించకుండా అడ్డుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కూడా అలాంటి సంఘటనలు మళ్లీ జరగవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మహిళలతో పాటు పురుషులు కూడా సంఘాలుగా ఏర్పడి మైక్రో రుణాలు తీసుకుంటుండటంతో కుటుంబాలపై ఆర్థిక భారం మరింత పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో వేల సంఖ్యలో మైక్రో ఫైనాన్స్ సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. మైక్రో ఫైనాన్స్ రుణాల కారణంగా సమభావన, స్త్రీనిధి రుణాలను కూడా పలువురు మహిళలు సక్రమంగా చెల్లించలేకపోతున్నారు. వారంవారం చెల్లించాల్సిన మైక్రో రుణ వాయిదాలు కారణంగా బ్యాంకు లింకేజీ రుణాలు బకాయిలుగా మారుతున్నాయి. ప్రభుత్వం మైక్రో ఫైనాన్సులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో లింకేజీ రుణాల బకాయిలు పెరగడంతో పాటు, మహిళల జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
కామిడి సతీష్ రెడ్డి
9848445134
