india vs afghanistan | అఫ్గాన్‌పై గిల్‌ సూప‌ర్ సెంచ‌రీ

india vs afghanistan | అఫ్గాన్‌పై గిల్‌ సూప‌ర్ సెంచ‌రీ

రెండో వన్డేలో కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడిన శుభ్‌మన్‌ గిల్‌
రోహిత్‌, ఇషాన్‌తో కీలక భాగస్వామ్యాలు..
భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్న టీమిండియా

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లక్నో వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్‌లో భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ అద్భుత శతకంతో చెలరేగిపోయాడు. 13 ఫోర్లు, 2 సిక్సుల‌తో గిల్ సెంచ‌రీ చేశాడు. బాధ్యతాయుతమైన ఆటతో పాటు దూకుడైన షాట్లతో ఆకట్టుకున్న గిల్‌, కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడుతూ టీమిండియాను భారీ స్కోరు దిశగా నడిపించాడు.

టాస్‌ గెలిచిన అఫ్గానిస్థాన్‌ కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన యశస్వి జైస్వాల్‌ కేవలం 4 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఇద్దరూ ఆరంభం నుంచే అఫ్గాన్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అర్ధశతకానికి చేరువైన రోహిత్‌ శర్మ 48 పరుగుల వద్ద రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. అయితే గిల్‌ మాత్రం తన దూకుడును కొనసాగించాడు.

ఆ తర్వాత ఇషాన్‌ కిషన్‌తో కలిసి గిల్‌ మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇషాన్‌ కూడా వేగంగా పరుగులు సాధిస్తూ మంచి సహకారం అందించడంతో గిల్‌ తన శతకాన్ని పూర్తి చేశాడు. తొలి వన్డేలోనూ జట్టుకు అండగా నిలిచిన గిల్‌, రెండో మ్యాచ్‌లో మరోసారి తన క్లాస్‌ను చాటుకున్నాడు. గిల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు వైపు దూసుకెళ్తుండగా, మరోవైపు ఇషాన్‌ కిషన్‌ కూడా శతకం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాడు. దీంతో అఫ్గానిస్థాన్‌ బౌలర్లపై ఒత్తిడి మరింత పెరిగింది.