Karnataka | కంటైనర్-ఆటో ఢీ…

Karnataka | కంటైనర్-ఆటో ఢీ…

  • వలస కూలీలు దుర్మరణం

కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాగేపల్లి పట్టణ శివార్లలోని జాతీయ రహదారి 44పై గంగోత్రి పెట్రోల్ బంక్ సమీపంలో వేగంగా కంటైనర్ లారీని ఆటోను ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు వలస కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా నజ్జునుజ్జయిపోయింది.

ఈ ఘోర ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో సామర్థ్యానికి మించి దాదాపు 15 మంది ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. కూలి పనుల నిమిత్తం బయటకు వెళ్లిన కార్మికులు, తిరిగి ఆటోలో తమ ఇళ్లకు వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆటోలో చిక్కుకుపోయిన బాధితులను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరికొంతమందిని చికిత్స కోసం తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతుల వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. వారు ఏ ప్రాంతానికి చెందిన వలస కూలీలనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. బాధితుల కుటుంబ సభ్యులను గుర్తించి సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘోర ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ జరుపుతున్నారు.

Leave a Reply