మీట్ రంగంలోకి కార్పొరేట్ కంపెనీల ప్రవేశం

మీట్ రంగంలోకి కార్పొరేట్ కంపెనీల ప్రవేశం

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో గొర్రెలు, మేక మాంసం విక్రయాల్లో పెద్ద కంపెనీలు అడుగు పెట్టబోతున్నాయి. కార్పొరేట్ కంపెనీలను ఆహ్వానించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. గొర్రె, మేక మాంసం రంగంలో ప్రభుత్వం నేరుగా ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏపీ ఫార్మ్ టు మార్కెట్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) మోడల్‌లో కొత్త కంపెనీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మాంసం సేకరణ, ప్రాసెసింగ్, స్థానిక విక్రయాలు, విదేశీ ఎగుమతులు చేపట్టాలని నిర్ణయించింది. దీనివల్ల రైతులకు మంచి ధరలు, నాణ్యమైన మార్కెట్ అవకాశాలు కలుగుతాయని అధికారులు చెబుతున్నా, ప్రైవేట్ వ్యాపారులు, చిన్న మాంసం విక్రేతలు తీవ్ర సందేహాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఆధునిక మాంసపు ప్రాసెసింగ్ యూనిట్లు, హైజీనిక్ మీట్ షాపులు, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ పేరుతో ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వ స్థలాలు లీజుకు ఇచ్చి విక్రయాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇది ఎలా అమలవుతుంది? ప్రజలకు లాభమా, లేక కార్పొరేట్లకే లాభమా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వం రూపొందించిన ఈ మోడల్ ప్రకారం, కంపెనీలో ప్రభుత్వం మెజారిటీ వాటా కలిగి ఉండి, ప్రైవేట్ భాగస్వాములు టెక్నాలజీ, మార్కెటింగ్, ఎగుమతి నైపుణ్యం అందించాలి. రైతుల నుంచి నేరుగా మాంసం సేకరణ ద్వారా మధ్యవర్తుల తొలగింపు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆధునిక ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్, ప్యాకేజింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అవకాశాలు పెంచాలని భావిస్తున్నారు.

పీపీపీ మోడల్ ఎలా ఉండబోతోంది

ప్రస్తుతం రాష్ట్రంలో మాంసం విక్రయాలు చాలా వరకు అనధికారికంగా జరుగుతున్నాయి. హైజీన్ లోపాలు, వ్యర్థాల సమస్యలు, అక్రమ వధలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. పీపీపీ మోడల్ ద్వారా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు అందించి, ప్రైవేట్ సంస్థలు ఆధునిక స్లాటర్ హౌసులు ఏర్పాటు చేస్తాయి. లీజ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ విధానంలో ప్రైవేట్ భాగస్వాములు మాంసం సేకరణ, ప్రాసెసింగ్, విక్రయాలు నిర్వహించి, ప్రభుత్వానికి రెవెన్యూ షేర్ చెల్లించాలి. ఇది ఆధునికీకరణకు కీలక అడుగుగా భావిస్తున్నారు.

ప్రభుత్వం ఎందుకు ఈ ఆలోచన చేస్తోంది?

అనధికారిక మాంసం విక్రయాల వల్ల ఆరోగ్య సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ కేసులు పెరుగుతున్నాయి. హైజీన్, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను మెరుగుపరచడం, ఎగుమతులను పెంచడం, రైతులకు అదనపు ఆదాయం కల్పించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పీపీపీ మోడల్‌ను ప్రభుత్వం అభివృద్ధి సాధనంగా భావిస్తోంది.

ప్రైవేట్ వ్యాపారులపై ప్రభావం

ప్రస్తుతం ఈ రంగంలో చిన్న వ్యాపారులు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కొత్త కంపెనీ ప్రవేశంతో వారి భవిష్యత్తుపై అనిశ్చితి, ఆందోళన నెలకొంది. పెద్ద కంపెనీల వల్ల మార్కెట్‌లో ఏకాధిపత్యం ఏర్పడి చిన్న వ్యాపారులు నష్టపోయే ప్రమాదం ఉంది.

ఇది వినియోగదారులకు కూడా ధరల పెరుగుదలకు దారి తీసే అవకాశం ఉందని ట్రేడర్స్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది. ప్రభుత్వం మెజారిటీ వాటాతో కంపెనీని నడిపితే, మార్కెట్ నియంత్రణ ప్రభుత్వ-ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. రైతుల నుంచి నేరుగా సేకరణ లక్ష్యం ఉన్నప్పటికీ, కొత్తగా కంపెనీ మధ్యవర్తులు రావచ్చనే సందేహాలు ఉన్నాయి.