క్లిష్టమైన ‘ఆర్పీజీఎన్’ చికిత్స విజయవంతం

క్లిష్టమైన ‘ఆర్పీజీఎన్’ చికిత్స విజయవంతం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: అత్యంత వేగంగా కిడ్నీల పని తీరును దెబ్బతీసే ‘రాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్’ (RPGN) అనే సంక్లిష్ట సమస్యను అధిగమించి, నల్గొండ జిల్లాలోని గుర్రంపూడ్ మండలానికి చెందిన 40 ఏళ్ల మహిళను, దేవరకొండకు చెందిన 29 ఏళ్ల మహిళను సురక్షితంగా కాపాడినట్లు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వీరమనేని చేతన్ తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ చేతన్ కేసుల వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లాకు చెందిన మహిళకు గత 15 రోజులుగా శరీరం మొత్తం వాపు (అనసార్కా), మూత్ర విసర్జన గణనీయంగా తగ్గిపోవడం, తీవ్రమైన నీరసం వంటి సమస్యలతో మలక్‌పేట యశోద ఆసుపత్రిలో చేరింది. ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కిడ్నీల పనితీరు వేగంగా క్షీణిస్తున్నట్లు (RPGN), అలాగే మూత్రం ద్వారా అధికంగా ప్రోటీన్ నష్టం (నెఫ్రోటిక్ రేంజ్ ప్రోటీనూరియా) జరుగుతున్నట్లు వైద్యులు గుర్తించారు.
ఈ దశలో స్వల్ప జాప్యం జరిగినా కిడ్నీలు శాశ్వతంగా దెబ్బతిని, బాధితురాలు జీవితాంతం డయాలసిస్‌పై ఆధారపడాల్సి వచ్చేదని తెలిపారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న వైద్య బృందం, వ్యాధి కారణాన్ని ఖచ్చితంగా గుర్తించేందుకు రియల్ టైమ్ అల్ట్రాసౌండ్ గైడెడ్ రీనల్ బయాప్సీ, హిస్టోపథాలజీ, ఇమ్యునోఫ్లోరోసెన్స్ వంటి అత్యాధునిక పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది.
“రాపిడ్ రీనల్ ఫెయిల్యూర్ అనేది ప్రాణాంతక పరిస్థితి. సకాలంలో వ్యాధిని గుర్తించి సరైన చికిత్స ప్రారంభించడం వల్లనే మంచి ఫలితాలు సాధించగలిగాం” అని డాక్టర్ చేతన్ తెలిపారు. నిరంతర పర్యవేక్షణ, సమగ్ర చికిత్సతో బాధితురాలు వేగంగా కోలుకుని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉండటంతో డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా మరో మహిళకు కూడా మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం నుంచి కాపాడినట్లు చెప్పారు.
ఆసుపత్రి డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ కె. శ్రీనివాస్ రెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదురు మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతికత మరియు నిపుణులైన వైద్య బృందం సమన్వయంతోనే ఇలాంటి క్లిష్టమైన కేసులను పరిష్కరించడం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భవిష్యత్తులోనూ అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆసుపత్రి బృందం సభ్యులు వాసుకిరణ్ రెడ్డి, జి. వెంకటేశ్వర్లు, నితిన్ పాల్గొన్నారు.
