రాజకీయ అడ్డంకులు సహించం..

రాజకీయ అడ్డంకులు సహించం..

మెప్మా ఎన్నికలను అడ్డుకోవడం వెనుక ఎవరు?
33లో 22 మంది మద్దతుతో డెక్కా నవ్య ఎన్నిక…
కిడ్నాప్ ఆరోపణలు ఎందుకు?
అధికారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు
పేకాట ఘటనపై పోలీసుల వైఖరి ప్రశ్నార్థకం… చర్యలు ఎక్కడ?
తన పై ఆరోపణలుంటే ఫ్లెక్సీలు పెట్టండి… ఖర్చు నేనే భరిస్తా.
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..

విజయవాడ, ఆంధ్రప్రభ : తిరువూరులో మెప్మా ఎన్నికల అంశం రాజకీయంగా వేడెక్కింది. ఎన్నికల సందర్భంగా కొంతమంది అభ్యర్థులను కిడ్నాప్ చేశారంటూ తిరువూరులో రాజకీయరచ్చ జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విలేఖరులతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సజావుగా జరిగితే ఎంపీ కేశినేని చిన్ని కి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. తిరువూరులో ఎన్నికలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

మొత్తం 33 మంది సభ్యుల్లో 22 మంది మద్దతుతో డెక్కా నవ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. అలాంటి పరిస్థితిలో మెజార్టీ సభ్యులను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. ప్రజాస్వామ్య ప్రక్రియను భంగం కలిగించే చర్యలను బాధ్యతాయుత ఎమ్మెల్యేగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరువూరులో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలపై కూడా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మైలవరం ప్రాంతంలో పేకాట ఆడుతున్న మహిళను పోలీసులు పట్టుకున్నప్పటికీ కేసు నమోదు చేయకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు.

అయితే పేకాటను అక్కడికక్కడే నిలిపివేసినందుకు పోలీసులను అభినందించారు. ఇక కొంతమంది అధికారులు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ, ఆఫీసులకు పిలిపించి డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. గత రెండేళ్లలో తాను ఎప్పుడైనా అధికారులను చట్టవిరుద్ధంగా వ్యవహరించాలని చెప్పానా అని ప్రశ్నించారు. మెప్మా అధికారులు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారా లేదా రాజకీయాలకు లోనవుతున్నారా అంటూ విమర్శించారు.

తనపై ఆరోపణలు చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని బహిరంగ సవాలు విసిరిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, అవసరమైతే ఆ ఖర్చు తానే భరిస్తానని స్పష్టం చేశారు. శాంతియుత వాతావరణం కలిగిన తిరువూరును బయటి వ్యక్తులు చెడగొట్టే ప్రయత్నాలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. తాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా చంద్రబాబు ఆశయాల సాధన కోసమే పనిచేస్తున్నానని వెల్లడించారు.