Indrakeeladri | శాకాంబరీ దేవిగా కనకదుర్గమ్మ


వైభవంగా శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం.
ఇంద్రకీలాద్రికి భక్తుల రాక
21,881 మంది భక్తులకు అమ్మవారి దర్శనం..
64,398 ప్రసాదాల పంపిణీ..
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

( ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రభ ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి శాకంబరీ ఉత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారి మూలవిరాట్టుతో పాటు ప్రధాన ఆలయం, ఉపాలయాలు, దేవతామూర్తుల ఆలయ ప్రాంగణాలను కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, డ్రైఫ్రూట్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

శాకంబరీ ఉత్సవాల్లో అత్యంత విశిష్టమైన కదంబ ప్రసాదాన్ని భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, దేవస్థాన పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ వివరాలు..

దేవస్థానం గణాంకాల ప్రకారం సోమవారం మొత్తం 21,881 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 4,978 దర్శన టికెట్లు జారీ అయ్యాయి. 64,398 ప్రసాదాల యూనిట్లు పంపిణీ చేశారు. హుండీ, విరాళాల రూపంలో రూ.1,51,431 విరాళాలు అందాయి. 317 సేవలు నిర్వహించగా, 1,299 మంది తలనీలాలు సమర్పించారు. అలాగే 7,020 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.