ఫెర్రీలో వైభవంగా సీతారాముల కల్యాణం

ఫెర్రీలో వైభవంగా సీతారాముల కల్యాణం
ఉమా పాల్గొని ప్రత్యేక పూజలు
ఆంధ్రప్రభ, ఇబ్రహీంపట్నం : ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫెర్రీ ప్రాంతంలోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు దేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకులు సంప్రదాయబద్ధంగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

ఉదయం నుంచే ఆలయం భక్తులతో నిండిపోయింది. మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ, ఆధ్యాత్మికతతోనే సమాజంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొంటాయి. ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు మన సంస్కృతి పరిరక్షణకు దోహదం చేస్తాయి అని పేర్కొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఫెర్రీ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.



