రాయదుర్గం భూ వివాదంలో టీజీఐఐసీకి ఊరట..
- వెంకటేష్ కుటుంబానికి ఎదురుదెబ్బ..
- హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం
ఆంధ్రప్రభ : తెలంగాణకు సంబంధించిన పలు కీలక కేసుల్లో గురువారం హైకోర్టు, సుప్రీంకోర్టులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాయదుర్గం 46 ఎకరాల భూ వివాదంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ)కి సుప్రీంకోర్టులో కొంత ఊరట లభించింది. మరోవైపు నటుడు దగ్గుబాటి వెంకటేష్ కుటుంబ సభ్యులపై కొనసాగుతున్న క్రిమినల్ కేసును కొట్టివేయాలన్న అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. అలాగే కొండాపూర్ కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు సంబంధించిన రెండు కీలక పిటిషన్లపైనా హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
రాయదుర్గం 46 ఎకరాల భూ వివాదంలో టీజీఐఐసీకి ఊరట..
రాయదుర్గం 46 ఎకరాల భూ వివాదంలో టీజీఐఐసీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, భూముల సర్వే విషయంలో వారం రోజుల పాటు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. అయితే, సర్వే ప్రక్రియను లేదా వేలం ప్రక్రియను పూర్తిగా నిలిపివేయాలని చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లితో కూడిన ధర్మాసనం, టీజీఐఐసీ తన అభ్యంతరాలను తెలంగాణ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ ద్వారా వినిపించాలని సూచించింది. ఇప్పటికే 2016 నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ రిట్ పిటిషన్‌ను మూడు నెలల్లోగా పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు అభ్యంతరాలను పరిశీలించకముందే సుప్రీంకోర్టు నేరుగా జోక్యం చేసుకోవడం సరైంది కాదని స్పష్టం చేసింది.
వెంకటేష్ కుటుంబానికి ఎదురుదెబ్బ..
ఫిల్మ్‌నగర్‌లో లీజుకు ఇచ్చిన ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై నమోదైన క్రిమినల్ కేసులో నటుడు దగ్గుబాటి వెంకటేష్, నిర్మాత డి. సురేష్‌బాబు, నటుడు రానా దగ్గుబాటి, డి. అభిరామ్, అకౌంటెంట్ గడ్డం విశ్వనాథం దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
ఈ వివాదం పూర్తిగా సివిల్ స్వరూపమని, క్రిమినల్ కేసు అనవసరమని పిటిషనర్లు వాదించినప్పటికీ, జస్టిస్ ఎన్. తుకారాంజీ ఆ వాదనను అంగీకరించలేదు. ఫిర్యాదు, ప్రమాణపత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తే విచారణ కొనసాగించేందుకు అవసరమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఈ దశలో సాక్ష్యాధారాలను పూర్తిగా విశ్లేషించే అవసరం లేదని స్పష్టం చేసింది.
హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం
కొండాపూర్‌లోని సర్వే నంబర్ 60లో కాంపౌండ్ వాల్, నిర్మాణాలను కూల్చివేసిన ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైడ్రా, అప్పటి శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం ఆదేశాల మేరకే కూల్చివేతలు చేపట్టామని కోర్టుకు తెలిపింది. దీంతో అప్పటి తహసీల్దార్‌గా పనిచేసి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్‌గా ఉన్న కె. వెంకట్ రెడ్డిని ఆగస్టు 12న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ఆదేశించారు.
భూమి ప్రభుత్వ భూమేనని నిర్ధారించే సర్వే నిర్వహించారా? భూ యజమానికి నోటీసులు ఇచ్చారా? చట్టబద్ధ ప్రక్రియను అనుసరించారా? అనే అంశాలపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి, “ప్రజలకు నోటీసులు ఇవ్వకుండా, కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించకుండా నిర్మాణాలను కూల్చివేసే అధికారం అధికారులకు ఎవరు ఇచ్చారు? మీరు ప్రజల కోసమా లేక మరెవరి కోసమా పనిచేస్తున్నారు?” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌పై ఈసీకి నోటీసులు
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్-2026)లో తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌ను చెల్లుబాటు అయ్యే పత్రంగా గుర్తించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ సర్టిఫికెట్ కేవలం సంక్షేమ పథకాల అమలు కోసం మాత్రమే ఉద్దేశించబడిందని, పౌరసత్వం లేదా ఓటరు అర్హతను నిర్ధారించే చట్టబద్ధ పత్రం కాదని పిటిషనర్లు వాదించారు. ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది సూచనలు తీసుకునేందుకు సమయం కోరడంతో విచారణను ఆగస్టు 12కు వాయిదా వేశారు.
షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఓటర్లపై మరో పిటిషన్
షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ సందర్భంగా గిరిజనేతరుల పేర్లను చట్టబద్ధంగా పరిశీలించి తొలగించాలని కోరుతూ మరో ప్రజాహిత వ్యాజ్యం తెలంగాణ హైకోర్టులో దాఖలైంది. ఈ పిటిషన్‌పై కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, ఎన్నికల కమిషన్, తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి, సంబంధిత జిల్లా కలెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
