గ్రామ సభ ఏకగ్రీవ నిర్ణయం..

గ్రామ సభ ఏకగ్రీవ నిర్ణయం
- ఉప్పరిపల్లిలో పాక్షిక మద్యపాన నిషేధం నేటి నుంచి అమలు
- ఉల్లంఘనకు రూ.5 వేలు జరిమానా
అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా, ఉప్పునుంతల మండలం ఉప్పరిపల్లి గ్రామంలో పాక్షిక మద్యపాన నిషేధం అమలు చేయాలని గ్రామ సభ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ సర్పంచ్ బొజ్జ గీత అమరేందర్ రెడ్డి తెలిపారు.
గ్రామ ప్రజల అభ్యర్థన మేరకు తీసుకున్న ఈ నిర్ణయం ఆదివారం (26-04-2026) నుండి అమల్లోకి రానుందని తెలిపారు. గ్రామంలో ప్రతిరోజూ రాత్రి 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మద్యపాన నిషేధం అమలులో ఉంటుందని, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకం, సేవనానికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.

గ్రామ పంచాయతీ నిర్ణయాన్ని ఉల్లంఘించి నిషేధ సమయంలో మద్యం అమ్మకం చేపడితే సంబంధిత వ్యక్తులకు రూ.5,000 జరిమానా విధించబడుతుందని సర్పంచ్ హెచ్చరించారు. గ్రామంలో క్రమశిక్షణ, ఆరోగ్యకర వాతావరణం నెలకొల్పడమే ఈ నిర్ణయ లక్ష్యమని తెలిపారు. అయితే చెట్టు కళ్లుకు ఈ నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పోలీస్ మరియు ఎక్సైజ్ శాఖలకు తెలియజేసినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంపై గ్రామస్థులు సానుకూలంగా స్పందిస్తూ, గ్రామ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
