Kalvakuntla Kavitha | మూడు ప్రధాన పార్టీలలో అవినీతి

Kalvakuntla Kavitha | మూడు ప్రధాన పార్టీలలో అవినీతి

Kalvakuntla Kavitha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన అనంతరం ప్రజలకు పలు కీలక హామీలు ఇచ్చారు. మునీరాబాద్ సభలో మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రజల సంక్షేమం కోసం ఐదు ప్రధాన అంశాలపై ప్రత్యేకంగా కృషి చేస్తామని కవిత తెలిపారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని వెల్లడించారు. BRS పాలనలో తెలంగాణ ఆత్మ కోల్పోయిందని అందుకే ఇవాళ TRS ఆవిర్భవించిందని అన్నారు. తెలంగాణలోని 3 కోట్ల మందికి ‘అమ్మ’గా మారాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు..

అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మంచి పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న మూడు ప్రధాన పార్టీలు అవినీతి, కుటుంబ పాలన, అధర్మంతో నిండిపోయాయని తీవ్ర విమర్శలు గుప్పించారు.

“నేను మీ అమ్మను.. తల్లి జేబు చూడదు, కడుపు చూస్తుంది” అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. దళితబంధు పథకంపై స్పందిస్తూ, ఒక్క ఉపఎన్నిక కోసమే దాన్ని అమలు చేశారని ఆరోపించారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటుతామని కవిత ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అమరవీరుడి కుటుంబానికి రూ. కోటి సాయం అందిస్తామని ప్రకటించారు. ఆడబిడ్డల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply