గజరాజుపై కొలువుదీరిన వానరరాజు..

గజరాజుపై కొలువుదీరిన వానరరాజు..

యాదాద్రి, ఆంధ్రప్రభ : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అద్భుత ఆధ్యాత్మికతకే కాదు, అప్పుడప్పుడు ప్రకృతిలో జరిగే వింతలకు కూడా వేదికవుతోంది. గురువారం ఉదయం యాదాద్రి కొండ పై ఒక అరుదైన, అత్యంత ఆసక్తికరమైన దృశ్యం భక్తుల కంటపడింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న నల్లరాతి ఏనుగు విగ్రహం పై ఒక కోతి ఎక్కి కూర్చోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా జంతువుల మధ్య ఉండే సహజ వైరాన్ని మరిచి, ఒక విగ్రహ రూపంలోని గజరాజు పై వానరరాజు ఎంతో గంభీరంగా, తీరిగ్గా కూర్చొని ఉండటం చూసి భక్తులు ముగ్ధులయ్యారు. ఈ వింత దృశ్యాన్ని చూసిన వారు ‘వినాయకుని వాహనంపై ఆంజనేయుడి కొలువు’ అంటూ భక్తితో స్మరించుకున్నారు.

కొండపైకి వచ్చే భక్తులు ఈ అపురూప దృశ్యాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించేందుకు పోటీ పడ్డారు. సోషల్ మీడియాలో సైతం ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. ఆలయ పరిసరాల్లోని ఆధ్యాత్మిక వాతావరణంలో ఇలాంటి సంఘటనలు భక్తులకు కనువిందును కలిగిస్తున్నాయి. సాధారణంగా వానరాలు అల్లరి చేస్తూ అటూ ఇటూ పరిగెడుతుంటాయి, కానీ ఈ కోతి మాత్రం ఏనుగు విగ్రహం పై చాలా సేపు ప్రశాంతంగా కూర్చొని ఉండటం క్షేత్ర మహిమేనని భక్తులు చర్చించుకుంటున్నారు. ఈ అరుదైన దృశ్యం యాదాద్రి కొండపై నేడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Leave a Reply