ఇండో-ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ మీట్‌లో పాల్గొన్న మేఘా రెడ్డి..

మునుగోడు, ఆంధ్రప్రభ : న్యూఢిల్లీలోని ఫిన్లాండ్ రాయబారి కార్యాలయంలో నిర్వహించిన ఇండో-ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ కనెక్ట్ కార్యక్రమంలో వెదిరె పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ వెదిరె మేఘా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశంలోని ఫిన్లాండ్ రాయబారి కిమ్మో లాదేవిర్టా ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
ఈ సమావేశంలో ఫిన్లాండ్ దేశంలో అమలవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత విద్యా విధానాలను భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే అవకాశాలపై చర్చించినట్లు వెదిరె మేఘా రెడ్డి తెలిపారు. ఈ అంశంపై ఫిన్లాండ్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా 42 ప్రముఖ విద్యాసంస్థల చైర్మన్లు,పాఠశాల సీఈఓలు,విద్యా రంగ నిపుణులు పాల్గొన్న కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుండి వెదిరె పూలమ్మ ఫౌండేషన్‌కు ఆహ్వానం అందడం విశేషమని పేర్కొన్నారు. విద్యా రంగంలో అంతర్జాతీయ సహకారం పెంపొందించడంలో ఈ సమావేశం ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
