ఉల్లిగడ్డ రాశికి నిప్పంటించిన దుండగులు

ఉల్లిగడ్డ రాశికి నిప్పంటించిన దుండగులు
ఊట్కూర్, ఆంధ్రప్రభ: ఆరుగాలం ఎంతో కష్టపడి ఉల్లిగడ్డ పంట పండించిన రైతు గిట్టుబాటు ధర లేక వ్యవసాయ పొలం వద్ద నిల్వ ఉంచగా గుర్తు తెలియని దుండగులు ఉల్లిగడ్డ రాశికి నిప్పంటించిన సంఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి బాధిత రైతు మహాదేవప్ప కథనం ప్రకారం.. నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహాదేవప్ప వ్యవసాయ బోరుబావి కింద ఈ ఏడాది మూడు ఎకరాల్లో ఉల్లిగడ్డ పంట సాగు చేసి మార్కెట్ లో గిట్టుబాటు ధర లేకపోవడంతో పండించిన ఉల్లిగడ్డను వ్యవసాయ పొలంవద్ద నిల్వ చేశాడు. బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఉల్లిగడ్డ రాశికి నిప్పు పెట్టడంతో సుమారు 150 సంచుల ఉల్లిగడ్డ పూర్తిగా దగ్ధమైందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక నిల్వ ఉంచిన పంట అగ్నికి ఆహుతి కావడంతో మహాదేవ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై రెవెన్యూ పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని రైతువాపోయాడు. ప్రభుత్వం బాధిత రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.
