మాట నిలబెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
- అగ్నిప్రమాద బాధితులకు రేకుల షెడ్డు నిర్మించి అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే
అచ్చంపేట, ఆంధ్రప్రభ: ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అగ్నిప్రమాద బాధితులకు అండగా నిలిచారు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు. పదర మండల పరిధిలోని మద్దిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో ఐదు దుకాణాలు పూర్తిగా దగ్ధమై బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
ఘటన అనంతరం బాధితులను పరామర్శించిన గువ్వల బాలరాజు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. అంతేకాకుండా తమ జీవనోపాధిని తిరిగి ప్రారంభించుకునేందుకు తన సొంత నిధులతో రేకుల షెడ్డు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం షెడ్డు నిర్మాణ పనులను పూర్తి చేసి శుక్రవారం బాధితులకు అందజేశారు. దీంతో బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కష్టకాలంలో బాధితుల వెంటే నిలబడి సహాయం అందించిన గువ్వల బాలరాజు సేవాభావం అభినందనీయమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండే నాయకుడిగా ఆయన మరోసారి నిరూపించుకున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నీలం రవి ముదిరాజ్, గోలి శ్రీను, శంకర్ మాదిగ, కొయ్యల మల్లేష్, శ్రీను, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
