దుర్గమ్మ సన్నిధిలో భక్తులరద్దీ…

దుర్గమ్మ సన్నిధిలో భక్తులరద్దీ…

ఆదివారం కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : వరుస సెలవులు వివాహాల సీజన్, వేసవి రద్దీతో ఇంద్రకీలాద్రి క్షేత్రం కిట కిట లాడింది. తెల్లవారు జాము నుండే అన్ని దర్శనం క్యూ లైన్లు కిక్కిరిసాయి. దేవీ ఖడ్గమాలార్చన, శ్రీ చక్రనవావరణార్చన, చండీహోమం, లక్ష కుంకుమార్చన ఆర్జిత సేవల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రద్దీ పరిస్థితి గమనించి భక్తులందరికి శ్రీ దుర్గామల్లేశ్వరుల దర్శనం సులభతరంగా పూర్తి అవ్వాలనే ధ్యేయంతో దేవాలయ సిబ్బంది క్యూ లైన్ల క్రమబద్దీకరణ, రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఉదయం 10 నుండే 500/- దర్శనం టికెట్ల అమ్మకాలు నిలుపుదల చేసి, అంతరాలయ దర్శనం పూర్తి స్థాయిలో నిలుపుదల చేశారు.

ఆలయ ఈవో శీనానాయక్ అంతరాలయం వెలుపల నుండే దర్శనం చేసుకొని, భక్తుల రద్దీ క్రమబద్దీకరణ చేశారు. చంటి బిడ్డల తల్లులు, వృద్దులు, వికలాంగులకు టిక్కెట్ తో సంబంధం లేకుండా ప్రత్యేక దర్శనలైన్ ద్వారా దర్శనం ఏర్పాటు చేయడమైనది. దేవస్థానం ఆధ్వర్యంలో సేవకుల ద్వారా మంచి నీరు, మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్లు భక్తులకు పంపిణీ చేయడమైనది. భక్తులకు వేసవి ఎండల నుండి ఉపశమనం కల్పించేందుకు ప్రధాన ఆలయం చుట్టు ప్రక్కలా ఏర్పాటు చేసిన చలువ పందిళ్ళు క్రింద భక్తులు సేద దీరారు.

దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె.శీనానాయక్ ఆదివారం ఉదయం 8 గంటలనుండి ప్రోటోకాల్ ఆఫీస్ లో ఉండి దర్శనం విన్నపాలు పరిశీలన చేసి, క్రమబద్దీకరణ చేశారు. భక్తులరద్దీ వలన ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేసామని రిఫరెన్స్ భక్తులకు నచ్చజెప్పారు. ఓం టర్నింగ్ నుండి శివాలయం వరకు వివిధ ప్రాంతాల్లో కలియ తిరిగి, ఉచిత ప్రసాదం పంపిణీ, పూజా మందిరం వద్ద పరిశీలన చేశారు.

శ్రీ అమ్మవారికి మధ్యాహ్న నైవేద్యం సమర్పణ తరువాత భక్తులరద్దీ తీవ్రంగా పెరిగడంతో ఘాట్ రోడ్ వైపు వాహనాల రాకపోకలు నిలుపుదల చేసి, దేవస్థానం బస్సులు, బ్యాటరీ వాహనాల ద్వారా భక్తులకు సేవలందించడమైనది.

భక్తులరద్దీ అనుసరించి దేవస్థానం అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించగా ఓం టర్నింగ్, ప్రోటోకాల్ ఆఫీస్, చిన్న రాజగోపురం, టికెట్ స్కానింగ్ పాయింట్, రావి చెట్టు ప్రాంతాలలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. ధర్మకర్తలమండలి సభ్యులు, వన్ టౌన్ పోలీసులు, శ్రీ అమ్మవారి సేవకులు భక్తుల రద్దీ నియంత్రణలో పాలుపంచుకున్నారు.

Leave a Reply