అత్యాచార ఘటనలు.. రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు..

అత్యాచార ఘటనలు.. రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు..

మచిలీపట్నం – ఆంధ్రప్రభ : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై జరిగిన దాడులు, అన్యాయాలు, అత్యాచార ఘటనలు రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని కృష్ణాజిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మాచవరపు ఆదిరాయణ అన్నారు. మంగళవారం మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ… మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటన రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు ఆ దారుణ ఘటన జరిగిన రోజును స్మరించుకుంటూ, మృతుడు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని ఆదిరాయణ తెలిపారు.

జగన్ పాలనలో దళితులపై దాడులు, హత్యలు, సామాజిక వివక్ష ఘటనలు పెరిగిపోయాయని, అనేక సందర్భాల్లో బాధితులకు న్యాయం జరగకుండా ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన విమర్శించారు. దళితుల అభివృద్ధి పేరుతో గొప్పలు చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వం, ఆచరణలో మాత్రం దళిత సమాజాన్ని తీవ్రంగా నిరాశపరిచిందన్నారు.

దళితులపై జరిగిన అనేక ఘటనల్లో నిందితులపై సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని పేర్కొన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల వినియోగం, దళిత సంక్షేమ పథకాల అమలులోనూ గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం దళితుల సంక్షేమం, భద్రత, సామాజిక న్యాయం కోసం కట్టుబడి పనిచేస్తోందని ఆదిరాయణ తెలిపారు. దళితుల అభ్యున్నతికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు.

గతంలో దళితులపై జరిగిన అన్యాయాలను ప్రజలు గుర్తుంచుకోవాలని, దళితుల పేరుతో రాజకీయాలు చేసిన వైసీపీ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పారని ఆయన పేర్కొన్నారు.

దళితుల ఆత్మగౌరవం, రక్షణ, అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని మాచవరపు ఆదిరాయణ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మచిలీపట్నం 19 వ డివిజన్ కార్పొరేటర్ దేవరపల్లి అనిత,, రాష్ట్ర కార్యదర్శి బురక బాలాజీ,కృష్ణ జిల్లా తెలుగుదేశం పార్టీ సెక్రటరీ వసంత కుమారి, ఎస్సీ నాయకులు చిట్టూరి యువరాజ్, మచిలీపట్నం ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం విజయ్ , మచిలీపట్నం ఉపాధ్యక్షులు లక్ష్మీ నాంచారమ్మ ,పెడన నియోజకవర్గ sc సెల్ అధ్యక్షులు ఆకునూరి వెంకటరత్నం, బలుసుపల్లి రత్న కుమార్, కొల్లూరి నాగరాజు పాల్గొన్నారు.

Leave a Reply