కాబోయే పటాన్ చెరు ఎమ్మెల్యేగా కాటా..
కాబోయే పటాన్ చెరు ఎమ్మెల్యేగా కాటా..
- గతంలో స్వల్ప ఓట్లతో ఓడిపోయిన కాటా శ్రీనివాస్ గౌడ్ ను కాంగ్రెస్ కార్యకర్తలు కడుపులో పెట్టుకొని గెలిపించుకోవాలి
- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
- వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా యేపూరి శివానందం, వైస్ చైర్మన్‌గా రాజశేఖర్ ప్రమాణ స్వీకారం
- ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి దామోదర్ రాజనర్సింహ
పటాన్ చెరు, ఆంధ్రప్రభ : కాబోయే పటాన్ చెరు ఎమ్మెల్యేగా కాటా శ్రీనివాస్ గౌడ్ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హాట్ కామెంట్స్ చేశారు. పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పటాన్ చెరు బస్టాండ్ చౌరస్తాలో మంత్రి దామోదర్ రాజనర్సింహకు నియోజకవర్గ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి, వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీగా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వరకు చేరుకున్నారు. ర్యాలీ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహకు గజమాలలు వేసి, బాణాసంచా కాల్చుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహభరిత స్వాగతం పలికారు. మంత్రి కూడా కార్యకర్తలకు అభివాదం చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా యేపూరి శివానందం, వైస్ చైర్మన్‌గా రాజశేఖర్, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం నూతన పాలకవర్గాన్ని మంత్రి ఘనంగా సన్మానించారు. రాజనర్సింహ మాట్లాడుతూ పటాన్ చెరు నియోజకవర్గానికి గొప్ప చరిత్ర ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పటాన్ చెరు అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా నిలిచిందని పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాటా శ్రీనివాస్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారని గుర్తుచేశారు. కాటా శ్రీనివాస్ గౌడ్ ను కాంగ్రెస్ కార్యకర్తలు కడుపులో పెట్టుకొని గెలిపించుకోవాలని, అందరూ ఐక్యంగా పని చేయాలని, రాబోయే రోజుల్లో పటాన్ చెరు ఎమ్మెల్యేగా కాటా శ్రీనివాస్ అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
పేద ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో కార్యకర్తలే అండగా నిలిచారని, వారికి తగిన న్యాయం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. రైతు సంక్షేమం, విద్య, వైద్య రంగాల అభివృద్ధి, మహిళా సాధికారతకు సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారని తెలిపారు. సంగారెడ్డి జిల్లాకు బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడిఎఫ్, ఐఐటి హైదరాబాద్ వంటి సంస్థలను తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, ఇందిరమ్మ మెదక్ ఎంపీగా ఉన్న సమయంలో జిల్లా అభివృద్ధి దిశగా ముందడుగు వేసిందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
