భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి
ఇంద్రకీలాద్రిపై మరిన్ని సౌకర్యాలు.
పరిశీలించిన ఈవో చైర్మన్ సభ్యులు
క్షేత్రస్థాయి పర్యటనలో లోపాల గుర్తింపు
అధికారులకు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : ఇంద్రకీలాద్రిపై భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై దేవస్థానం యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ , ధర్మకర్తల మండలి సభ్యులు రాఘవ రాజు , శ్రీనివాసరావు రావు లు దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. కనకదుర్గ నగర్‌లో ప్రసాదాల కౌంటర్ల సమీపంలో భక్తులు ఎండ వేడిమి నుంచి రక్షణ పొందేందుకు షెడ్ ఏర్పాటు పనులను పరిశీలించారు.
అదేవిధంగా సురక్షిత తాగునీటి ప్లాంట్ ఏర్పాటు పురోగతిని సమీక్షించారు. తరువాత బ్యాటరీ వాహనంలో ఘాట్ రోడ్ వైపు వెళ్లిన అధికారులు ఆన్‌లైన్ సేవా కేంద్రం, దర్శనం క్యూ లైన్ల మార్పులు, లగేజ్ మరియు చెప్పుల స్టాండ్ల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల రాకపోకలు సులభంగా సాగేందుకు అవసరమైన మార్పులపై సూచనలు చేశారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులు ఎదుర్కొంటున్న వాహనాల పార్కింగ్ సమస్యలను సమగ్రంగా పరిశీలించిన అధికారులు, శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు.
క్యూ లైన్ మార్గం ద్వారా ప్రధాన ఆలయం వరకు పర్యటించిన బృందం భక్తులకు తాగునీరు, ఫ్యాన్ సౌకర్యాలు వంటి ప్రాథమిక సదుపాయాలను పరిశీలించింది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యవంతమైన సేవలు అందించడం దేవస్థానం ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి అంశంలో మెరుగుదల తీసుకువచ్చి యాత్రికులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.
