సృజనాత్మక చారిత్రక ప్రతిభకు పట్టం

సృజనాత్మక చారిత్రక ప్రతిభకు పట్టం
- ఉత్సాహంగా రూట్స్ రీ లోడెడ్ కార్యక్రమం
- ఘనంగా అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం వేడుకలు
ఆంధ్రప్రభ, విజయవాడ:
సోమవారం అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, 20 పాయింట్ల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరాం, ఏపీ క్రియేటివిటీ, కల్చర్ కమిషన్ చైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి, ఏపీటీడీసీ చైర్‌పర్సన్ ఎన్. బాలాజీ, ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ కమిషనర్ పి సురేష్, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తదితరులు పాల్గొన్నారు.
యువతలో చరిత్ర, సంస్కృతి, కళల పట్ల ఆసక్తి పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో
దోహదపడతాయని పేర్కొన్నారు. మ్యూజియంలు మన సంస్కృతి, నాగరికత, వారసత్వానికి ప్రతిబింబాలని తెలిపారు. భావితరాలకు చారిత్రక సంపదను చేరువ చేయాలంటే విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మ్యూజియంల ప్రాధాన్యం, వారసత్వ పరిరక్షణ అవసరంపై ప్రత్యేక సందేశాలను అందిస్తూ నిర్వహించిన ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా మన నాగరికత ఆనవాళ్లు కనిపిస్తున్నాయంటే .. మన ప్రాంత వైభవం, విశిష్టత ఏపాటిదో అర్థమవుతోందన్నారు.
ముఖ్యమంత్రి వినూత్న కార్యక్రమాలతో మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు విలువైన వారసత్వ సంపదగా అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. విజయవాడలో విజయవాడ ఉత్సవ్, ఆవకాయ్ ఉత్సవ్, ప్రపంచ వారసత్వ దినోత్సవం, ఇప్పుడు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ వేడుకలు ఇలా వరుసగా కార్యక్రమాలు జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని.. మన ఆలోచనలను విస్తృతం చేసేందుకు, కొత్త ఆలోచనలు దిశగా నడిపించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కలెక్టర్ లక్ష్మీశకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.


