తక్షణ చర్యలు తీసుకోవాలి – డాక్టర్ మెహబూబ్ షేక్..
తక్షణ చర్యలు తీసుకోవాలి – డాక్టర్ మెహబూబ్ షేక్..
విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్) వైద్య సేవలను నెట్‌వర్క్ ఆస్పత్రులు నిలిపివేయకుండా తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మెహబూబ్ షేక్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారోగ్యం, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. ఇప్పటికే పలుమార్లు నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని, అధికారులను కలిసి సుమారు రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని కోరినా స్పందన లేకపోవడం దురదృష్టకరమన్నారు.
గత ఏడాది డిసెంబర్‌లో బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చి, ఆ తరువాత వన్‌టైమ్ సెటిల్మెంట్ పేరుతో కాలయాపన చేయడం తప్పా మరేమీ చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆస్పత్రుల యాజమాన్యాలు అప్పుల భారంలో కూరుకుపోయి, వైద్యులు, సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మరో వైపు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పరిస్థితి మరింత దిగజారకముందే ప్రభుత్వం వెంటనే స్పందించి, బకాయిలను విడుదల చేసి ఆరోగ్యశ్రీ సేవలు నిరంతరంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్ మెహబూబ్ షేక్ కోరారు.
