ఆహ్లాదకర వాతావరణంలో వర్చువల్ మహానాడు

ఆహ్లాదకర వాతావరణంలో వర్చువల్ మహానాడు
నందిగామ, ఆంధ్రప్రభ : చందర్లపాడు మండలం కంచల రిసార్ట్స్‌లో ఆహ్లాదకర వాతావరణంలో చందర్లపాడు మండలం క్లస్టర్–2 పరిధిలో నిర్వహించిన వర్చువల్ మహానాడు కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు అఖిల్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక అయిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీ విశిష్టతను, ఎన్టీ రామారావు తెలుగు ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. తెలుగు దేశం పార్టీ కోట్లాది మంది ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్న పార్టీ అని పేర్కొన్న తంగిరాల సౌమ్య, కోటి సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీగా టీడీపీ ప్రత్యేక స్థానం సంపాదించుకుందని తెలిపారు. రాష్ట్రానికి భారీ పారిశ్రామిక పెట్టుబడులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు వేయగల విజనరీ నాయకత్వం చంద్రబాబు నాయుడు దేనని, అలాంటి నాయకత్వం రాష్ట్రానికి దక్కడం ప్రజల అదృష్టమని అన్నారు.
అలాగే యువనేత, విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న మంత్రి నారా లోకేష్ కృషిని కూడా ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో లాల్ బహుదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రోడక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు, క్లస్టర్ యూనిట్ కన్వీనర్, కో కన్వీనర్లు, పోలింగ్ బూత్ కన్వీనర్ , కో కన్వీనర్లు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
