వైభవంగా ముగిసిన కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

వైభవంగా ముగిసిన కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

చక్రస్నానంలో పాల్గొన్న భక్తులు.
పుష్పయాగంతో సమాప్తి

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలోని విజయకీలాద్రిపై వెలసిన శ్రీ మద్వీరాంజనేయస్వామి మరియు శ్రీ సీతా సమేత కోదండరామస్వామి వార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు చైత్ర శుద్ధ ఏకాదశి సందర్భంగా దేవస్థానంలో వైభవంగా నిర్వహించబడ్డాయి. ఆదివారం జరిగిన కార్యక్రమాల్లో భాగంగా నిత్యార్చన, నిత్య హోమ, బలిహరణాదులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం చూర్ణోత్సవం, వసంతోత్సవం, అవబృందోత్సవాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన చక్రస్నానం కృష్ణానదిలో నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.

తరువాత పూర్ణాహుతి, హారతి, మంత్రపుష్పం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు. సాయంత్రం కార్యక్రమాల్లో భాగంగా నిత్యార్చన, హోమ బలిహరణాదుల అనంతరం బ్రహ్మోత్సవాల ముగింపు సూచికగా ధ్వజావరోహణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవస్థాన వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, రేపు (మార్చి 30) ఉదయం 8 గంటలకు శ్రీ పుష్పయాగం, సాయంత్రం 6:30 గంటలకు ద్వాదశి ప్రదక్షిణలు, డోలోత్సవం, పవళింపు సేవలతో బ్రహ్మోత్సవాలు సంపూర్ణంగా ముగుస్తాయి.