రాష్ట్రవ్యాప్త విద్యారంగ ప్రక్షాళనకు సీఎం శ్రీకారం..
రాష్ట్రవ్యాప్త విద్యారంగ ప్రక్షాళనకు సీఎం శ్రీకారం..
విద్యా రంగ పునరుజ్జీవనానికి రాష్ట్ర విద్యాశాఖ పాఠశాల కమిషనర్ గా ఏ.తమీమ్ అన్సారియా నియామకం మైలురాయి…
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా ఏ. తమీమ్ అన్సారియా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు రాష్ట్ర విద్యారంగ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచాయని విద్యావేత్తల అభిప్రాయపడుతున్నరు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, సమయోచిత నిర్ణయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
గతంలో వైసిపి హయాంలోనూ పనిచేసిన కమిషనర్ విద్యావ్యవస్థను బ్రష్టు పట్టించాడని ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి కుటుంబంలో వచ్చిన కమిషనర్ కూడా ఉపాధ్యాయ సంఘాలతో సఖ్యత లేక విద్యావ్యవస్థను కొంతమేర వెనుకబాటు గురిచేసాడని విమర్శలు వినిపించాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి చొరవ తీసుకుని నూతన కమిషనర్ గా ఐఏఎస్ అధికారిని నియమించటం విద్యాశాఖ ప్రక్షాళనకు మార్గం సుగమం అయింది.

2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణిగా, కంప్యూటర్ సైన్స్‌లో బి .ఈ మరియు జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుండి పబ్లిక్ మేనేజ్మెంట్లో ఎం .ఏ పూర్తి చేసిన తమీమ్ అన్సారియాకి ఉన్న శక్తివంతమైన విద్యా పునాది, పరిపాలనా అనుభవం ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయని విద్యాభిమానులు పేర్కొంటున్నరు.శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్‌గా ప్రారంభమైన ఆమె సేవా ప్రయాణం, అన్నమయ్య జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా, శ్రీశైలం ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్‌గా, ప్రకాశం జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌గా, గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కొనసాగుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమె ప్రత్యేక ముద్ర వేశారు.
నంద్యాల జిల్లా కలెక్టర్ గా పనిచేసి ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కలెక్టర్ డాక్టర్ మనీజీర్ జిలాని సామూన్ కు భాగస్వామిగా ఉన్నారు. ప్రత్యేకంగా సామాజిక సమస్యల పరిష్కారం, బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనలో ఆమె చూపిన కృషి ప్రశంసనీయమైనది. ప్రజల పట్ల సున్నితమైన స్పందన, క్రమశిక్షణతో కూడిన పరిపాలన, అభివృద్ధి పట్ల అంకితభావం ఆమె నాయకత్వానికి బలమైన ఆధారాలు ఆమె కెరియర్ కు ప్రతిష్టగా నిలిచాయన్నారు. విద్యపై అపారమైన అభిరుచి కలిగిన ఆమె, ఉపాధ్యాయులు, గురువుల పట్ల గౌరవ భావన కలిగిన నాయకురాలు.
ఉపాధ్యాయుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించేందుకు చొరవ చూపడం, విద్యారంగంలో సమన్వయం సాధించడం ఆమె ప్రత్యేకత. ముఖ్యంగా బాలికల విద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రాథమిక దశ నుంచే నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకుంటారని విద్యావేత్తలు విశ్వసిస్తున్నారు. విద్యారంగంలో ఉన్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ, ఉపాధ్యాయ సంఘాలు, విద్యా విశ్లేషకులు, అధికారులతో సమన్వయం కల్పిస్తూ పారదర్శకత, నాణ్యత, సమాన అవకాశాలపై ఆధారపడి వ్యవస్థను ముందుకు తీసుకెళ్లగల దూరదృష్టి ఆమెకు ఉంది.
వివాదాలకు తావులేకుండా సుస్థిరమైన, అభివృద్ధి దిశగా నడిచే విద్యా వాతావరణాన్ని నెలకొల్పగల నాయకత్వం ఆమె సొంతం గా ఉంటుందని విద్యాభిమానులు భావిస్తున్నారు. ఈ నియామకం ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతూ, నాణ్యతా ప్రమాణాల్లో కొత్త శిఖరాలను అధిరోహించనుందని రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, విద్యావేత్తలు గట్టిగా నమ్ముతున్నారు. తమీమ్ అన్సారియా నాయకత్వంలో విద్యారంగం సరికొత్త దిశగా పయనిస్తూ, భవిష్యత్ తరాలకు వెలుగునిచ్చే స్వర్ణయుగానికి నాంది పలకనుందని ఉపాధ్యాయ సంఘాలు విద్యాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
