ఆర్‌బీకే అద్దెల కుంభకోణం

ఆర్‌బీకే అద్దెల కుంభకోణం

విచారణకు గైర్హాజరైన భవన యజమానులు
రైతు సొమ్ము దోచేశారా? అనుమానాలకు బలం

నందికొట్కూర్, ఆంధ్రప్రభ : రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) అద్దెల పేరుతో జరిగిన అక్రమాలపై జిల్లా అధికారుల విచారణ రెండో రోజుకు చేరుకుంది. ఏవో రంగారెడ్డి ఫిర్యాదు మేరకు 2021-22 కాలంలో జరిగిన బోగస్ బిల్లులు, ఫోర్జరీ వ్యవహారంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు.

గురువారం జరిగిన రెండో రోజు విచారణకు నోటీసులు అందుకున్న ఏడుగురు భవన యజమానుల్లో ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన ఆరుగురు గైర్హాజరుకావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే విచారణకు దూరంగా ఉన్నారా అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు.

మొదటి రోజు 12 మంది హాజరుకాగా, మొత్తం 18 మంది భవన యజమానుల్లో ఇప్పటివరకు 13 మంది మాత్రమే విచారణకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. జూపాడు బంగ్లా మండల పరిధిలో ఆర్‌బీకే అద్దెల పేరుతో జరిగిన అవకతవకలపై సేకరించిన వివరాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

తంగడంచ గ్రామ ఆర్‌ఎస్‌కే భవన యజమాని మాత్రమే విచారణకు హాజరయ్యారని, గైర్హాజరైన వారి వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు (ఏడీఏ) సరళమ్మ మాట్లాడుతూ, బోగస్ బిల్లులు, ఫోర్జరీ ఆరోపణలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందన్నారు. పూర్తి వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు.

Leave a Reply