విద్యుత్‌ఛార్జీలను తగ్గింపుతో పాటుగా నాణ్యమైన విద్యుత్….

విద్యుత్‌ఛార్జీలను తగ్గింపుతో పాటుగా నాణ్యమైన విద్యుత్….
పటమట, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపారని, నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలను తగ్గించారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించడమే కాకుండా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఘనత కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదేనని అన్నారు.
గురువారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్‌లోని బ్రహ్మానందరెడ్డి నగర్ 1వ రోడ్డులో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. స్థానికులు తెలియజేసిన సమస్యలను పరిష్కరించాల్సిందిగా కార్పోరేషన్ లోని ఆయా విభాగాల అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం డివిజన్‌లోని నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి రూ.40 వేల రూపాయల విలువ చేసే రెండు తోపుడు బండ్లు, ప్లాట్‌ఫారమ్ రిక్షాను ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి వారికి ఉచితంగా అందచేశారు.

కాపు దుర్గాప్రసాద్, కాసుల పద్మావతికి తోపుడు బండ్లను, ఆవాల రమణకు ప్లాట్‌ఫారమ్ రిక్షాను అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని అన్నారు. గతంలో విద్యుత్ సమస్యలు చాలా వచ్చేవని, ఇప్పుడు విద్యుత్ సమస్యలు అనేవి లేవని అన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హాయంలో ట్రూఆప్ ఛార్జీలు అని విద్యుత్ వినియోగదారులపై మోయలేని భారాలు విధించారని చెప్పారు.

ఐదు సంవత్సరాల వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని అన్నారు. నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్ వినియోగదారులపై ఆర్థిక భారాలు తగ్గించడానికి ట్రూ డౌన్ అంటూ విద్యుత్ ఛార్జీలను తగ్గించి విద్యుత్ వినియోగదారులకు మేలు చేశారన్నారు. ఏపీ ట్రాన్స్‌కోకు రూ.15 వేల కోట్లు లోటు బడ్జెట్ వచ్చిందని, ఆ నిధులను కూడా తామే భరీస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకుని విద్యుత్ వినియోగదారులపై భారాలు మోపకుండా చేశారన్నారు.
మనిషి జీవన విధానంలో ప్రధానంగా భారం పడేది విద్యుత్ ఛార్జీలేని, అలాంటి భారాలను తగ్గించడమే కాకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ పార్టీ అధ్యక్షుడు పడాల గంగాధర్ మాట్లాడుతూ డివిజన్‌లోని నిరుపేదలకు రూ.40 వేల విలువ చేసే రెండు తోపుడు బండ్లు, ప్లాట్‌పారమ్ రిక్షాను అందచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.
కొండ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ వల్లనే సాధ్యమని అన్నారు. గద్దె రామమోహన్‌నే తాము ఎల్లప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటామని నియోజకవర్గ ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు పల్లి దుర్గాప్రసాద్, అమిర్నేని కరుణకుమారి, మజ్జి రామానాయుడు, సతీష్ చంద్ర, సప్ప శ్రీను, వడ్డి సుబ్బారావు, పడాల నాగు, మకర సోమనాయుడు, షకీలా, మకర రామారావు, రాచమళ్ల రాము, సగరపు అప్పారావు, సిరా ప్రసాద్, జయ తదితరులు పాల్గొన్నారు.
