జీజీహెచ్‌లో యూత్ టైం బ్యాంక్..
జీజీహెచ్‌లో యూత్ టైం బ్యాంక్..
వినూత్న కార్యక్రమాల ద్వారా సేవాభావం.
సేవలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : జిల్లా యువజన సర్వీసులు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూత్ టైం బ్యాంకు సేవలను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మంగళవారం న్యూ జీజీహెచ్‌లో యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా. కొల్లేటి రమేష్, వైద్యాధికారులతో కలిసి ప్రారంభించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, వాసవ్య మహిళా మండలి చేయూతతో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని ఓపీడీ బ్లాక్, డా. ఎన్టీఆర్ వైద్య సేవ, స్కానింగ్ బ్లాక్ తదితర ప్రాంతాల్లో యూత్ టైం బ్యాంక్ విధానం కింద యువత అవసరమైన వారికి సేవలు అందించనుంది.
వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, నిరక్షరాస్యులు తదితరులు అవసరమైన వైద్య సేవలు పొందడంలో జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన 20 నుంచి 30 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్వచ్ఛందంగా రోజూ సేవలు అందిస్తారు. టైం బ్యాంకు విధానంలో సేవలు అందించే వారికి ఇంటర్న్‌షిప్‌లో ప్రత్యేక మార్కులు కూడా ఇచ్చేందుకు మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ యువత అవసరమైన వారికి సేవలు అందించేందుకు సామాజిక బాధ్యతతో ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు.

యూత్ టైం బ్యాంక్ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా సేవాభావం పెంపొందడమే కాకుండా, సమాజంలో పరస్పర సహకారం బలపడుతుందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కోసం వచ్చే వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, నిరక్షరాస్యులకు ఈ సేవలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని చెప్పారు.
ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు చూపుతున్న సేవాస్ఫూర్తి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా. ఏడుకొండలు, ఆర్ఎంవో డా. పద్మావతి, ఆంధ్ర లయోలా కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, వాసవ్య మహిళా మండలి సభ్యులు, యువజన సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
