మంథని మున్సిపల్ అభివృద్ధికి కట్టుబడి ఉంటా…

మంథని మున్సిపల్ అభివృద్ధికి కట్టుబడి ఉంటా…
- వార్డుల వారిగా కమిటీని ఏర్పాటు చేసుకోవాలి
- ప్రభుత్వం పథకాలు ప్రజలకు అందేలా పనిచేయాలి
- నిత్యం ప్రజల మధ్యలో ఉండాలి
- నూతన మున్సిపల్ పాలకవర్గానికి పలు సూచనలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు
మంథని, ఆంధ్రప్రభ : మంథని మున్సిపల్ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం మంథని మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యుల మొదటి సాధారణ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ మనోహర్ రెడ్డి సాధారణ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు వార్డుల వారిగా కమిటీలు ఏర్పరుచుకోవాలని మంత్రి సూచించారు. కమిటీ నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. వార్డు సమస్యలన్నింటినీ ఓపికగా ప్రణాళిక బద్ధంగా పరిష్కరించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. త్రాగునీరు, వీధి దీపాలు, మొక్కల పెంపకం, పారిశుద్ధ్య పనులు మొదలైనటువంటి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పేర్కొన్నారు.

వచ్చేది వేసవికాలం కౌన్సిలర్లు అప్రమత్తతో ఉండాలని తెలిపారు. ప్రజలకు అవసరమైనటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా తగు చర్యలు చేపట్టాలని వివరించారు. మున్సిపల్ పరిధిలో ప్రజలు ఇబ్బంది పడకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యాచరణ చేపట్టాలని వివరించారు. మున్సిపల్ వార్డులో ప్రతి ఒక్క అర్హుడికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని వివరించారు. తదుపరి మెప్మా విభాగంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులు స్వయంగా పనికిరాని వస్తువులతో తయారు చేసిన సృజనాత్మక వస్తువులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు కుర్ర లింగయ్య, నూకల కమల్, మాచిడి రాజు గౌడ్, ఏరుకల స్రవంతి రమేష్ బాబు, పోతరబోయిన శ్రీలత క్రాంతి కుమార్, జంబోజు శ్రీమతి సమ్మయ్య, మారుపాక నిహారిక నాగరాజు, వేముల లక్ష్మీ సమ్మయ్య, ఎల్లంకి వంశీధర్, మున్సిపల్ మహిళా సిబ్బంది, మెప్మా ఆర్పీలు, తదితరులు పాల్గొన్నారు.
