మారిస్ స్టెల్లా కాలేజీకి 11 పేటెంట్లు..

మారిస్ స్టెల్లా కాలేజీకి 11 పేటెంట్లు..

పరిశోధన,ఆవిష్కరణల్లో మరో మైలురాయి
ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణ రంగాల్లో వినూత్న సాంకేతిక పరిష్కారాలు

పటమట, ఆంధ్రప్రభ : విజయవాడలోని ప్రముఖ విద్యాసంస్థ మరీస్ స్టెల్లా కాలేజీ పరిశోధన, ఆవిష్కరణల రంగంలో విశిష్ట విజయాన్ని సాధించింది. కళాశాలకు చెందిన అధ్యాపకులు, పరిశోధక బృందం రూపొందించిన పలు వినూత్న సాంకేతిక పరిష్కారాలకు మొత్తం 11 పేటెంట్లు మంజూరుకావడం విశేషంగా నిలిచింది. ఈ పేటెంట్లను ఇండియన్ పేటెంట్ కార్యాలయం మంజూరు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ఇన్ని్యాసమ్మ తెలిపారు. పరిశోధనకు ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థులు, అధ్యాపకుల్లో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం వల్లే ఈ విజయాన్ని సాధించగలిగామని ఆమె పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడమే కళాశాల పరిశోధన కార్యక్రమాల లక్ష్యమని వివరించారు.

కళాశాల పరిశోధకులు అభివృద్ధి చేసిన పేటెంట్లలో న్యూట్రాస్యూటికల్స్ తయారీ విధానాలు, పాల నాణ్యతను గుర్తించే టెస్ట్ కిట్, మైక్రోబియల్ బయోఫిల్టర్లు, స్మార్ట్ సెన్సర్ ఆధారిత ఆటోమేటెడ్ సీడ్ సార్టింగ్ మరియు క్వాలిటీ ఎవాల్యుయేషన్ సిస్టమ్, పర్యావరణహిత పద్ధతిలో స్పిరులినా ఉత్పత్తి విధానం, నైట్రేట్ విషపూరితతను గుర్తించే రియాజెంట్, ఎకోకాస్మెటిక్స్ అభివృద్ధి సాంకేతికత, అలాగే బహుళ పంటల వ్యవసాయ ప్రాసెసింగ్‌కు ఉపయోగపడే స్మార్ట్ సోలార్ డీహైడ్రేషన్ సిస్టమ్ వంటి కీలక రంగాలు ఉన్నాయి. ఈ విజయానికి కళాశాల యాజమాన్యం అందించిన నిరంతర ప్రోత్సాహమే ప్రధాన కారణమని ప్రిన్సిపాల్ తెలిపారు. ముఖ్యంగా కరస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ లీనా క్వాద్రాస్ అందించిన సహకారం పరిశోధన కార్యకలాపాలను మరింత బలోపేతం చేసిందన్నారు.

అలాగే విజయవాడలోని రతన్ టాటా ఇన్నోవాషన్ హబ్ అందించిన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం వల్లే ఈ పేటెంట్లు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఈ పరిశోధన కార్యక్రమాల్లో కళాశాల బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బోటనీ, అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ విభాగాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు సమిష్టిగా పనిచేశారు. మేధస్సు సంపత్తి హక్కుల రక్షణతో పాటు పరిశోధన ఫలితాలను సమాజానికి ఉపయోగపడే పరిష్కారాలుగా మలచడం అత్యంత అవసరమని ప్రిన్సిపాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పేటెంట్ల సాధనతో **మరీస్ స్టెల్లా కాలేజీ పరిశోధన ఆవిష్కరణల రంగంలో తన ప్రత్యేక స్థానాన్ని మరోసారి చాటుకుంది. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తూ సమాజానికి ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాల అభివృద్ధికి కళాశాల మరింత కృషి చేస్తుందని యాజమాన్యం వెల్లడించింది.

Leave a Reply